Share News

కమర్షియల్ పైలట్‌గా అభినందన్ వర్ధమాన్..

ABN , Publish Date - Sep 03 , 2026 | 01:25 PM

భారత వాయుసేనలో మాజీ గ్రూప్ కెప్టెన్, వీర చక్ర పురస్కార గ్రహీత అభినందన్ వర్దమాన్ కొత్త కొలువును ఎంచుకున్నారు. గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ FLY91లో కమర్షియల్ పైలట్‌గా ఆయన చేరారు.

కమర్షియల్ పైలట్‌గా అభినందన్ వర్ధమాన్..
Abhinandan Varthaman

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 03: భారత వాయుసేనలో మాజీ గ్రూప్ కెప్టెన్, వీర చక్ర పురస్కార గ్రహీత అభినందన్ వర్ధమాన్ కొత్త కొలువును ఎంచుకున్నారు. గోవాకు చెందిన ప్రాంతీయ విమానయాన సంస్థ FLY91లో కమర్షియల్ పైలట్‌గా ఆయన చేరారు. ఆగస్టులోనే ఆయన ఈ ఉద్యోగంలో చేరినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో 22 ఏళ్లుగా వాయుసేనలో వివిధ హోదాల్లో పని చేసిన అభినందన్ వర్ధమాన్.. ముందస్తుగానే ఉద్యోగానికి పదవి విరమణ చేశారు. అయితే కొత్త ఉద్యోగంలో చేరికపై ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.


2019లో ఫిబ్రవరిలో పుల్వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. అందుకు ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ నేపథ్యంలో పాక్ వైమానిక దళానికి ఎఫ్-16 యుద్ధ విమానం భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. దీనిని తన మిగ్ విమానంతో వింగ్ కమాండర్ అభినందన్ ఆకాశంలోనే ధ్వంసం చేశారు. అదే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న ఆ విమానం దెబ్బతింది.


ఈ నేపథ్యంలో పారాచూట్ సాయంతో కిందకి దూకారు. దాంతో ఆయన పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలో దిగారు. దీంతో అభినందన్‌ను పాక్ సైన్యం చుట్టుముట్టింది. మూడు రోజుల పాటు ఆయనను పాక్ సైన్యం బందీగా ఉంచింది. అభినందన్ వర్ధమాన్‌ను వెంటనే తమకు అప్పగించాలంటూ పాక్‌పై భారత్ తీవ్ర ఒత్తిడి చేసింది. దీంతో ఆయనను భారత్‌కు పాక్ అప్పగించింది. ఈ నేపథ్యంలో అభినందన్ వర్ధమాన్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. దేశంలో మూడో అత్యున్నత యుద్ధ పురస్కారం వీరచక్రతో ఆయనను భారత్ ప్రభుత్వం గౌరవించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కొండా సురేఖ విషయంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం: ఎంపీ కేశినేని చిన్ని

For More National News And Telugu News

Updated Date - Sep 03 , 2026 | 02:04 PM