Share News

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం: ఎంపీ కేశినేని చిన్ని

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:29 PM

మేయర్‌ని నేరుగా ప్రజలు ఎన్నుకునేలా సీఎం చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. డైరెక్ట్ మేయర్ ఎలక్షన్ అనేది సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరిగిందని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం: ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ, సెప్టెంబర్ 03: స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేయర్ ఎన్నికల్లో కూటమి విజయం తథ్యమన్నారు. తాము 95 శాతంతో స్ట్రైక్ రేట్ చేయబోతున్నామని.. అందులో ఢోకా లేదని చెప్పారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయవాడలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని తెలిపారు. మన కలల రాజధాని అమరావతి, పోలవరం పూర్తి చేసుకుంటున్నామని చెప్పారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా పని చేస్తున్నామని అన్నారు. ఇక్కడ మనకు పోటీ లేదని.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అభ్యర్థులకు ఢోకానే లేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


పార్టీ కోసం పనిచేసిన వారందరూ.. ఈసారి అదృష్టం వరిస్తుందని ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. మేయర్‌ని నేరుగా ప్రజలు ఎన్నుకునేలా సీఎం చంద్రబాబు నాయుడు ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారని తెలిపారు. డైరెక్ట్ మేయర్ ఎలక్షన్ అనేది సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోనే జరిగిందని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఓ మేయర్ పదవి సాధించుకుందంటే.. డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే అని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని వివరించారు. ప్రజల్లో తమ పట్ల అభిమానం అధికంగా ఉంటుందని చెప్పారు. మొట్టమొదటి డైరెక్ట్ మేయర్ పంచుమర్తి అనురాధ అని గుర్తు చేశారు. టీడీపీ అభ్యర్థిగా విజయవాడలో భారీ మెజారిటీతో ఆమె గెలుపొందారని అన్నారు.


ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు వచ్చి తాము డైరెక్ట్‌గా గెలవలేమని చెప్పారని పేర్కొన్నారు. దీంతో మేయర్ ఎన్నికపై కార్పొరేషన్‌లో కార్పొరేటర్ల ద్వారా ఇన్‌డైరెక్ట్ ఎలక్షన్‌గా నిర్ణయించారని తెలిపారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు.. ప్రజల అభిప్రాయం‌ మేరకే మేయర్ అని ప్రకటించారని చెప్పారు. ఈ ఎన్నికల ద్వారా చక్కటి అభ్యర్థులు వస్తారని.. గజిబిజి, గందరగోళం లేకుండా చక్కగా ఎలక్షన్ కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు.. ఓ సాధారణ మహిళను ఎమ్మెల్సీగా తీసుకొచ్చారని చెప్పారు.


టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేష్, కూటమి ఆధ్వర్యంలో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో, ఎవరికైతే ప్రజల్లో మంచి పేరుందో.. అటువంటి వారినే అభ్యర్థులుగా నిలబెడతామని తెలిపారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఇక్కడ ఎన్నికలు జరిగితే ఇబ్బంది వాతావరణం ఉంటుందన్నారు. నిజంగానే ఎలక్షన్లు దసరా సమయంలో ఉంటే, పోలీస్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ బిజీగా ఉంటారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తోసుకోవాలని ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశామన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని చెప్పారు.

Updated Date - Sep 03 , 2026 | 12:45 PM