Share News

సుభాష్‌చంద్రకు షాక్‌!

ABN , Publish Date - Sep 02 , 2026 | 06:22 AM

ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌చంద్రపై వ్యక్తిగత దివాలా పరిష్కార కేసు మరో మలుపు తిరిగింది. రూ.22 వేల కోట్ల రుణాలకుగాను రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తానంటూ...

సుభాష్‌చంద్రకు షాక్‌!

  • రూ.6.5 కోట్ల తిరిగి చెల్లింపుల ఆఫర్‌పై స్టే

  • ఆయన వ్యక్తిగత ఆస్తుల విక్రయంపైనా నిషేధం

  • ఆదేశాలు జారీచేసిన ఎన్‌సీఎల్‌టీ కొత్త బెంచ్‌

  • అన్ని పక్షాలకూ నోటీసులు.. తదుపరి విచారణ 23న

  • బ్యాంకులు, రుణసంస్థల అప్పీల్‌పై

  • నేడు విచారణ జరపనున్న అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌చంద్రపై వ్యక్తిగత దివాలా పరిష్కార కేసు మరో మలుపు తిరిగింది. రూ.22 వేల కోట్ల రుణాలకుగాను రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తానంటూ ఆయన ప్రతిపాదించిన రుణచెల్లింపు ప్రణాళికపై.. చరిత్రలో తొలిసారిగా ఏర్పాటైన ఎన్‌సీఎల్‌టీ ఐదుగురు సభ్యుల బెంచ్‌ స్టే ఇచ్చింది. ఆయన ఆస్తులను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎవరికీ బదిలీ చేయకుండా, విక్రయించకుండా నిషేధం విధించింది. దీంతోపాటు.. ఈ కేసులో ఉన్న అన్ని పక్షాలకూ నోటీసులు జారీచేసింది. ఈ బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్న ఎన్‌సీఎల్‌టీ ప్రెసిడెంట్‌ జస్టిస్‌ అనుపిందర్‌ సింగ్‌ గ్రెవాల్‌.. ప్రతిపాదిత రుణచెల్లింపు ప్రణాళికపై మెజారిటీ అభిప్రాయం రానందున ఈ దశలో తుది ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొన్నారు. తదుపరి విచారణను సెప్టెంబరు 23వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు.. బ్యాంకులు, రుణసంస్థల అప్పీలును అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ విచారణకు స్వీకరించింది. సుభా్‌షచంద్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, కెనరా బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ తదితర బ్యాంకులు, రుణసంస్థల తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ఈ అప్పీలును త్వరగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఎన్‌సీఎల్‌ఏటీ ఈ అంశాన్ని బుధవారం విచారణ జాబితాలో చేర్చింది.

గతంలో జరిగింది ఇదీ..

ఈ కేసును విచారించిన ఎన్‌సీఎల్‌టీ గత బెంచ్‌ సభ్యులైన అశోక్‌ కుమార్‌ భరద్వాజ్‌ (జుడీషియల్‌), రీనా సిన్హా పురి(టెక్నికల్‌) భిన్నంగా తీర్పు ఇవ్వడంతో ఎన్‌సీఎల్‌టీ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ నీలేశ్‌ శర్మ (జుడీషియల్‌)ను మూడో సభ్యుడిగా నియమించారు. చంద్ర ఆఫర్‌ను తిరస్కరించిన రుణదాతల వాదనలను తోసిపుచ్చిన నీలేశ్‌ శర్మ.. ఐబీసీ చట్టంలో సెక్షన్‌ 114 ప్రకారం ప్లాన్‌ను ఆమోదించారు. అయితే, ‘‘మూడో సభ్యుడు స్వతంత్రంగా ఓ ఉత్తర్వును జారీ చేశారు. తద్వారా, ఎటువంటి మెజారిటీ అభిప్రాయం వెలువడలేదు. కాబట్టి, తుది తీర్పును జారీ చేయలేమ’’ని ఎన్‌ఎ్‌సఎల్‌టీ బెంచ్‌ సభ్యులు ఆశోక్‌, రీనా పేర్కొన్నారు. అలాగే, కేసును మళ్లీ ఎన్‌సీఎల్‌టీ ప్రెసిడెంట్‌ వద్దకు పంపారు. దాంతో ఈ కేసు విచారణకు ఏకంగా ఐదుగురు సభ్యులతో కూడిన బెంచ్‌ ఏర్పాటైంది.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 06:22 AM