మహిళ సంఘాల సభ్యులకు ఈ కేవైసీ
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:59 AM
ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది.
పెద్దపల్లి రూరల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. సభ్యుల అభ్యున్నతికి సాయం అందిస్తున్న ప్రభుత్వం, సంక్షేమ పథకాలలు అర్హులకే అందించాలనే లక్ష్యంతో విధిగా ఈ కేవైసీ చేయాలని నిర్ణయించింది.. మండలంలోని 30 గ్రామపంచాయతీల్లో 1365 గ్రామ సమైఖ్య సంఘాలు, స్వయం సహయక సంఘాల ఉండగా వాటిలో 14279 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 7522 మంది సభ్యుల వివరాలు 60 శాతం అనుసంధాన ప్రక్రియ పూర్తయ్యింది. సభ్యురాలి ఫొటో, ఆధార్‌లో ఉన్న ఫొటో ఒకేవిధంగా ఉంటేనే ఈ ప్రక్రియ సజావుగా పూర్తి కానుంది. ఇప్పటివరకు 60 శాతం వరకు ఈ కేవైసీ పూర్తి చేశారు. స్వయం సహాయక సంఘాల్లో అర్హులైన మహిళలే సభ్యులుగా కొనసాగాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం సభ్యులందరికి ఈ కేవైసీ తప్పనిసరిగా చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సంఘాలకు సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇదివరకే లోకోస్ యాప్‌లో నమోదు చేశారు. సంఘాల ఆర్థిక ప్రగతి, తీసుకున్న రుణాలు, వాయిదాల చెల్లింపులు, నిర్వహిస్తున్న వ్యాపారాలు, లాభనష్టాలు తదితర వివరాల సమాచారం అప్‌డేట్ కాలేదు. లోకోస్ యాప్‌లో నమోదైన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులందరితో ఐకేపి సిబ్బంది ఈ కేవైసీ చేయించడంలో నిమగ్నమయ్యారు. ఆధార్ అప్‌డేట్, మొబైల్ నెంబర్ ఆధార్‌కు లింక్ లేకపోయినా ఆధార్ కేంద్రానికి వెళ్లి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.
ఫ అర్హులైన వారికే సంక్షేమ పథకాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మహిళలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చేరాలనే లక్ష్యంతో ఈ కేవైసీ తప్పనిసరిగా చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేరుగా లబ్ధిదారులకు, సంస్థలకు చేరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
ఫ ఈకేవైసీ వంద శాతం పూర్తి చేస్తాం
- శాంతి శైలజ, ఏపీఎం, పెద్దపల్లి
ప్రభుత్వ విధించిన ఈ కేవైసీ ప్రక్రియను వంద శాతం పూర్తి చేస్తాం. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలు పెండింగ్ లేకుండా చెల్లిస్తూ , ఉపాధి పొందాలి.