రికార్డుల్లో ఒకలా.. 22ఏలో మరోలా!
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:50 AM
నిషేధిత భూముల జాబితా (22ఏ) వ్యవహారంలో మరెన్నో లొసుగులు బయటపడుతున్నాయి. రిజిస్ట్రేషన్, ప్రభుత్వ రికార్డుల్లో ఒకలా.. 22ఏ జాబితాల్లో మరోలా భూములు ఉండటం కలకలం రేపుతోంది.
పరిశ్రమలు, సొసైటీల భూములపైనా రెవెన్యూ అధికారుల పేచీలు
పెట్టుబడులకు, రిజిస్ట్రేషన్లకు అడ్డంకిగా మారిన నిషేధిత జాబితా
22ఏలో భూములను చేర్చడాన్ని తప్పుపడుతూ న్యాయస్థానాల ఆదేశాలు
మార్పులు చేసే పనిలో కలెక్టర్లు.. పూర్తికి నెల పడుతుందంటున్న అధికారులు
అసెంబ్లీలో పెట్టేందుకు 33 జిల్లాల్లోని పాత, కొత్త జాబితాల క్రోడీకరణపై దృష్టి
హైదరాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నిషేధిత భూముల జాబితా (22ఏ) వ్యవహారంలో మరెన్నో లొసుగులు బయటపడుతున్నాయి. రిజిస్ట్రేషన్, ప్రభుత్వ రికార్డుల్లో ఒకలా.. 22ఏ జాబితాల్లో మరోలా భూములు ఉండటం కలకలం రేపుతోంది. ప్రైవేటు వ్యక్తుల భూములతోపాటు పరిశ్రమలు, సొసైటీలు, భారీ ప్రాజెక్టులకు సంబంధించిన భూములపైనా రెవెన్యూ అధికారులు పెడుతున్న పేచీపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనితో రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై, రిజిస్ట్రేషన్ల ఆదాయంపై ప్రభావం పడుతోందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయు. మరోవైపు 22ఏ జాబితాలపై రెవెన్యూ శాఖ కసరత్తు కొలిక్కి రాలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో 33 జిల్లాల కలెక్టర్లు కూడా.. 2023 డిసెంబరు 7కు ముందున్న 22ఏ జాబితా.. 2025 డిసెంబరు తరువాత వచ్చిన జాబితాల్లోని భూముల లెక్కలు క్రోడీకరిస్తున్నారు. 2025 డిసెంబరులో తయారు చేసిన 22ఏ జాబితా రూపకల్పనలో అశాస్త్రీయంగా వ్యవహరించడంతో చిక్కులొచ్చాయి. సీఎం నివాసం నుంచి సామాన్యుల ఇళ్ల వరకు భారీగా ప్రైవేటు ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కింద సుమారు 3,000 ఎకరాల భూమి ఉంది. అందులో 1,288 ఎకరాలు ఒక్క 403 సర్వే నంబరు పరిధిలోనే ఉన్నాయి. అందులోనే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం రెండు ప్లాట్ల మీద కోర్టు కేసులుంటే అధికారులు మొత్తం సర్వేనంబర్ పరిధిని 22ఏ జాబితాలో పెట్టారు. పదవీ విరమణ చేసిన హైకోర్టు జడ్జి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలికి చెందిన భూమిని కూడా 22ఏ జాబితాలో చేర్చారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో సర్వే నంబరు 41/8, 41/9 సూర్యోదయ అబోది ఫ్లాట్లను అసైన్డ్ భూమిగా చూపారు. 2026 జూన్‌లో హైకోర్టు దీనిని తప్పుబట్టింది. ప్రైవేటు భూమిని 22ఏలో చేర్చేటప్పుడు చట్టబద్ధమైన ప్రక్రియ పాటించారా అని నిలదీసింది. ఇక ఇబ్రహీంపట్నం ఆదిభట్ల వద్ద సర్వే నంబరు 58, 59లలో కె.లక్ష్మారెడ్డికి చెందిన సుమారు 35 ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టారు. టీజీఐఐసీ పాత భూసేకరణ ప్రొసీడింగ్స్ ఆధారంగా 22ఏలో పెట్టడం సమర్థనీయం కాదని హైకోర్టు తేల్చింది.
అడ్డగోలుగా నిర్ణయాలతో..
సన్‌కోర్ పవర్ ప్రాజెక్టుకు చెందిన ఎర్రగడ్డ పరిధిలో సర్వే నంబరు 116/1లో ఉన్న భూమిని తహసీల్దార్ ప్రభుత్వ భూమిగా చూపుతూ.. రిజిస్ట్రేషన్ చేయొద్దని లేఖ రాశారు. దీనిపై ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అసలు 22ఏ జాబితాలో పెట్టే అధికారం, రిజిస్ట్రేషన్ అడ్డుకునే అధికారం తహసీల్దార్‌కు ఉందా అని కోర్టు నిలదీసింది. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలికి శంషాబాద్ దగ్గర గుబ్బడిలో సర్వే నంబరు 103/45ఏఏ, పరిధిలో 3.26 ఎకరాలు, 103/45ఇ లో 1.04 ఎకరాలు భూమి ఉంది. కలెక్టర్ ఇచ్చిన లేఖ ఆధారంగా ఈ భూములను 22ఏలో పెట్టడాన్ని కోర్టు తప్పుబట్టింది. 22ఏ నుంచి తొలగించాలని జూలై 28న ఆదేశించింది. ఇక జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో సర్వే నంబరు 74లో 60 ఎకరాలు కేటాయించారు. ఆ భూమికి ప్రభుత్వం లేఅవుట్ కూడా అనుమతించింది. సుమారు 549 మందికి ప్లాట్లు కేటాయించే క్రమంలో.. పలు సర్వే నంబర్లలో న్యాయపరమైన వివాదాలు ఉన్నాయంటూ 22ఏలో పెట్టేశారు. ఒక సర్వే నంబరులో కేవలం ఎకరా, అర ఎకరా స్థలం మీద వివాదం ఉంటే.. మొత్తం సర్వే నంబరులోని భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందిపెడుతున్నారంటూ సొసైటీ తరఫున రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డికి లేఖ రాసినా ఇప్పటికీ.. 22ఏ నుంచి
తొలగించలేదు.. తొలగించింది గోరంత.. తొలగించాల్సింది కొండంత
సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యంతో వేల ఎకరాలు 22ఏ జాబితాలోకి వెళ్లాయి. ఉదాహరణకు కరీంనగర్‌లో సీలింగ్ రికార్డులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. సీలింగ్ పరిధిలోని భూమిని మాత్రమేగాకుండా పాత రికార్డుల ఆధారంగా ఒకే సర్వే నంబరులో ఉన్న మొత్తం 675 ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టారు. అక్కడ నిషేధిత జాబితాలో పెట్టాల్సిన భూమి 75 ఎకరాలు మాత్రమే. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు తలెత్తాయి. రెవెన్యూ శాఖ దీనిని చక్కదిద్దే పని మొదలుపెట్టినా.. ఇప్పటికీ వేల ఎకరాలు 22ఏ జాబితాలోనే ఉన్నాయని అంటున్నారు.
సీలింగే అసలు సమస్య
క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) పరిధిలో సీలింగ్ భూముల వివాదం ఇబ్బందిగా మారింది. పాత సీలింగ్ రికార్డులను పరిగణనలోకి తీసుకుని పెద్ద ఎత్తున 22ఏ జాబితాలో పెట్టారు. ప్రస్తుతం సీలింగ్ భూముల్లో చాలా వరకు కాలనీలు, ఇళ్లు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొనుగోలు చేసిన సీలింగ్ భూములకు మినహాయింపు ఉన్నా.. అనధికారికంగా ఎన్నో లావాదేవీలు జరిగాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇస్తే చాలా వరకు 22ఏ వివాదం సద్దుమణిగే అవకాశం ఉందని కలెక్టర్లు చెబుతున్నారు. లేదంటే ఈ వ్యవహారం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అంటున్నారు.
సరిదిద్దడానికి మరింత సమయం
22ఏ వ్యవహారాన్ని సరిదిద్దేందుకు మరింత సమ యం కావాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. హడావుడిగా చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025 డిసెంబరులో 22ఏ జాబితా రూపొందించే క్రమంలో.. ఒక్క భూమి మిస్సయినా చర్యలు తప్పవని ఉన్నతస్థాయి నుంచి హెచ్చరికలు వచ్చాయని ఓ రెవెన్యూ ఽఅధికారి తెలిపారు. దీనితో క్షేత్రస్థాయి అధికారులు ఏకంగా 1950నాటి భూరికార్డులను ప్రామాణికంగా తీసుకుని 22ఏ జాబితాలు తయారు చేశారని.. దీంతో వేల ఎకరాలు నిషేధిత జాబితాలో చేరాయన్నారు. దీనంతటినీ చక్కదిద్దేందుకు ఒకట్రెండు వారాలు సరిపోవని.. కనీసం నెల రోజులు పడుతుందని, అదనపు సమ యం ఇవ్వాలని కలెక్టర్లు కోరుతున్నారు. సరిదిద్దిన జాబితాలను రోజువారీగా అప్‌లోడ్‌చేస్తూ పాత జాబితాలను భూభారతి పోర్టల్ నుంచి తొలగిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రేవంత్‌కు అండగా.. ఆయన మాటకే అధిష్ఠానం ఓటు
నేను మాట్లాడితే మా అమ్మను ఎందుకు బలి చేశారు ?
Read Latest Telangana News And AP News And National News
And Telugu News