Share News

ట్రాన్స్‌కోలో 26 శాతం వాటా విక్రయం

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:43 AM

తెలంగాణ విద్యుత్‌ టాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (ట్రాన్స్‌కో)లో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టాలని తెలంగాణ పవర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించింది. ఇందుకోసం పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాలని యోచిస్తోంది.

ట్రాన్స్‌కోలో 26 శాతం వాటా విక్రయం
TG TRANSCO

  • నిధుల సమీకరణకు సంస్థ ప్రణాళిక

  • పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాలని తెలంగాణ పవర్‌

  • కో-ఆర్డినేషన్‌ కమిటీ నిర్ణయం

  • కన్సల్టెన్సీగా ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్‌

  • అనధికారికంగా మీడియాతో మాట్లాడొద్దని

  • ఉద్యోగులకు ట్రాన్స్‌కో ఆదేశాలు

  • 26శాతం వాటా విక్రయించి నిధుల సమీకరణకు ప్రణాళిక

హైదరాబాద్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యుత్‌ టాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (ట్రాన్స్‌కో)లో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టాలని తెలంగాణ పవర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించింది. ఇందుకోసం పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లాలని యోచిస్తోంది. కన్సల్టెన్సీగా ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్‌ సంస్థను నియమించుకోవాలని ఇటీవలటీపీసీసీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ట్రాన్స్‌కోలో రాష్ట్ర ప్రభుత్వానికి 100 శాతం వాటాలున్నాయి. ఇందులో 26 శాతం వాటాను విక్రయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కంపెనీ ముఖ విలువ రూ.68 వేల కోట్లుగా ఉంది. సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం 75 శాతం వాటా ప్రభుత్వం వద్ద ఉండాలి. దీనికోసం ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీవో)కు వెళతారు. తొలుత డ్రాఫ్ట్‌ రెడ్‌ హె ర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ)ని సిద్ధం చేసి, కంపెనీ తన వివరాలు, ఆర్థిక పరిస్థితి, డబ్బు ఎందుకు అవసరం వంటి అంశాలను సెబీకి తెలపాల్సి ఉంటుంది. డీఆర్‌హెచ్‌పీ ఆమోదం తర్వాత ఐపీవోకు వెళతారు. ఆ తర్వాత స్టాక్‌ మార్కెట్‌లో కంపెనీ లిస్ట్‌ అయ్యి షేర్లను ప్రజలకు అమ్ముతారు. అలా వచ్చే నిధులు ట్రాన్స్‌కోకు వెళతాయి. మలి విడతలో సెకండరీ మార్కెట్‌లో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ), బాంబే స్టాక్‌ ఎక్స్‌చేంజ్‌(బీఎ్‌సఈ)లో లిస్టింగ్‌ అవుతుంది. ఆ తర్వాత కంపెనీ పనితీరు ఆధారంగా షేరు విలువ పెరగడం, తగ్గటం జరుగుతుంది.


నగదు నిల్వలు లేకున్నా లాభాల్లోనే...

ట్రాన్స్‌కోకు నగదు నిల్వలు లేకున్నా సంస్థ లాభాల్లోనే ఉంది. రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులు నెలనెలా చెల్లించే కరెంట్‌ బిల్లులన్నీ ట్రాన్స్‌కో ఖాతాలోనే పడతాయి. డిస్కమ్‌లు ఉన్నప్పటికీ విద్యుత్‌ కొనుగోళ్లు, విక్రయాలన్నీ ట్రాన్స్‌కోనే నియంత్రిస్తోంది. ట్రాన్స్‌కోలో ఇతర సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. 11 కేవీ, 33 కేవీ సబ్‌స్టేషన్లు డిస్కమ్‌ల చేతిలో ఉంటే... 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్‌స్టేషన్లు ట్రాన్స్‌కో చేతిలో ఉన్నాయి. రాష్ట్రంలో 400 కేవీ సామర్థ్యం కలిగిన సబ్‌స్టేషన్లు 29.. 220 కేవీ సబ్‌స్టేషన్లు 107.. 132 కేవీ సబ్‌స్టేషన్లు 337 ఉన్నాయి. ఈహెచ్‌టీ లైన్లు 31,420 సర్క్యూట్‌ కిలోమీటర్లు ఉండగా, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు 1,184 దాకా ఉన్నాయి. ట్రాన్స్‌మిషన్‌ సామర్థ్యం 43,848 ఎంవీఏ (మెగావోల్ట్‌ అంపైర్‌)గా ఉంది. తెలంగాణలో ఐపీవోకు వెళ్లనున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థ ట్రాన్స్‌కోనే. ఇక ఒకసారి పెట్టుబడుల ఉపసంహరణతో షేర్లను విక్రయిస్తే... ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మదుపర్ల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి మరో ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ట్రాన్స్‌కోలో పెట్టుబడుల ఉపసంహరణ లాభదాయక ఫలితాలిస్తే.. ఆ తర్వాత జెన్‌కోలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.


అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడొద్దు

అధికారులు, ఉద్యోగులు, ఆర్టిజన్లు మీడియాతో అనధికారికంగా మాట్లాడినా, సంస్థకు సంబంధించిన అధికారిక లేదా అంతర్గత సమాచారాన్ని వెల్లడించినా కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌కో హెచ్చరించింది. ఈ మేరకు ఆగస్టు 21వ తేదీన సర్కులర్‌ జారీ చేసింది. సంస్థకు సంబంధించిన అంతర్గత విషయాలు సున్నిత, గోప్యమైన సమాచారం క్యాంటీన్లు, కారిడార్లు, లిఫ్టులు, వెయిటింగ్‌ ఏరియాలు, ప్రజా రవాణా, సామాజిక సమావేశాలు, బహిరంగ ప్రదేశాల్లో చర్చించకూడదని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ట్రాన్స్‌కో డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌) ఓరుగంటి శ్రీనివాసులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సెక్రటేరియట్‌ ముట్టడి ఉద్రిక్తం!

బకెట్‌లో 160 డిటోనేటర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 04 , 2026 | 06:43 AM