కొండా సురేఖ బర్తరఫ్.. స్వయంకృతాపరాధమే!
ABN , Publish Date - Sep 04 , 2026 | 06:16 AM
మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కావడం.. ఆమె స్వయంకృతాపరాధమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ, ప్రభుత్వం ఆమెకు అనేక అవకాశాలిచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోలేదు: ఆది శ్రీనివాస్
అన్నీ ఆలోచించాకే సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలు: మల్లు రవి
హైదరాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్ కావడం.. ఆమె స్వయంకృతాపరాధమేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పార్టీ, ప్రభుత్వం ఆమెకు అనేక అవకాశాలిచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై పదే పదే విమర్శలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపర్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కొండా సురేఖ వ్యవహార శైలిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే క్రమశిక్షణారాహిత్యాన్ని సహించకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అధిష్ఠానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారంటూ కొండా సురేఖ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. కొండా సురేఖతో పాటు సీనియర్ నేత చిన్నారెడ్డిని కూడా పదవి నుంచి తప్పించారని గుర్తు చేశారు. పార్టీ నిబంధనలు, లక్ష్మణరేఖ దాటి మాట్లాడే ఎంతటి వారినైనా కాంగ్రెస్ ఉపేక్షించబోదని, కఠిన చర్యలు తీసుకుంటుందని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పష్టం చేశారు. ఏఐసీసీ అన్నీ ఆలోచించే కొండా సురేఖ, చిన్నారెడ్డిలను పదవుల నుంచి తొలగించిందని తెలిపారు. క్రమశిక్షణ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండబోదని, క్రమశిక్షణకు తానూ అతీతుడిని కానని పేర్కొన్నారు. తనను ఏకపక్షంగా తొలగించారంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మల్లు రవి తోసిపుచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సెక్రటేరియట్ ముట్టడి ఉద్రిక్తం!
Read Latest Telangana News And AP News And National News
And Telugu News