Share News

రూ.35కే కిలో ఉల్లి

ABN , Publish Date - Sep 04 , 2026 | 05:33 AM

ఉల్లిపాయల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయించడానికి ఏర్పాటు చేస్తోంది.

రూ.35కే కిలో ఉల్లి

  • త్వరలోనే రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు: మంత్రి నాదెండ్ల

  • తగ్గింపు ధరలకు పామాయిల్‌, కందిపప్పు అందుబాటులోకి

  • మార్కెట్‌ ధరపై 10 తగ్గించి విక్రయించేందుకు ఏర్పాట్లు

  • మంత్రుల సబ్‌ కమిటీ భేటీలో నిర్ణయాలు

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉల్లిపాయల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయించడానికి ఏర్పాటు చేస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలను అదుపు చేసే చర్యల్లో భాగంగా గురువారం జరిగిన మంత్రుల సబ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, సత్యకుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ధరల అదుపునకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు చర్చించారు. సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర (ఎన్‌సీసీఎఫ్‌) సహకారంతో ఉల్లిపాయలు కేజీ రూ.35కే అందించేలా ఏర్పాట్లు చేయాలని క్యాబినెట్‌ సబ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఉల్లిపాయల అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 350కి పైగా ప్రత్యేక బియ్యం కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే బియ్యాన్ని వినియోగదారులకు అందిస్తున్నాం’ అని మంత్రి వివరించారు. పామాయిల్‌, కందిపప్పు ధరలను కూడా మార్కెట్‌ ధరపై రూ.10 చొప్పున తగ్గించి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

Updated Date - Sep 04 , 2026 | 05:33 AM