టార్గెట్.. టేకోవర్..!
ABN , Publish Date - Oct 02 , 2026 | 09:23 AM
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మెట్రోరైలు నిర్మాణానికి విశేష కృషి చేసిన ఎన్వీఎస్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించింది.
మెట్రో రైలు ప్రాజెక్టును పరుగులు పెట్టించేలా ప్రభుత్వ చర్యలు
ఎన్వీఎస్ రెడ్డికి తాజా బాధ్యతల వెనుక కారణమదే!.. రెండో దశ డీపీఆర్‌పై దృష్టి
హైదరాబాద్ సిటీ: విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మెట్రోరైలు నిర్మాణానికి విశేష కృషి చేసిన ఎన్వీఎస్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం మరో బాధ్యతను అప్పగించింది. ఉద్యోగ విరమణ పొంది ఇప్పటి వరకు ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా కొనసాగుతున్న ఆయనను మెట్రోకు సంబంధించిన అదనపు బాధ్యతలతోపాటు టీజీ ఆర్టీసీ, ఇతర ప్రజారవాణా మార్గాలతో ప్రతిపాదిత ఉమ్మడి టికెటింగ్ వ్యవస్థను సమన్వయం చేయాలని పేర్కొంది. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ప్రస్తుతం ఆయనకు కేటాయించిన బాధ్యతల్లో భాగంగా ప్రధానంగా మొదటి దశ మెట్రో స్వాధీనంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడిచినా మెట్రో ప్రాజెక్టు పరంగా ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులో పురోగతి లేదు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఎన్వీఎస్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా ప్రాజెక్టును పరుగులు పెట్టించాలని భావిస్తోంది. ప్రస్తుతం మెట్రో ఎండీగా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్.. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా పూర్తిస్థాయిలో వ్యవహరిస్తున్నారు.
దీంతో పనిభారం కారణంగా ఆయన మెట్రో కార్యకలాపాలపై సరిగా దృష్టి సారించలేకపోతున్నారనే భావన ప్రభుత్వంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ పట్టణ రవాణా సలహాదారుగా కొనసాగుతున్న ఎన్వీఎస్ రెడ్డిని ఫీల్డ్‌లోకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఢిల్లీలో పనిచేసిన అనుభవం ఉండడంతో రెండో దశకు కావాల్సిన అనుమతులు, అభ్యంతరాలపై ఆయన అక్కడి అధికారులతో ఎప్పటికప్పుడు సులువుగా చేరవేసే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వ సలహాదారుతోపాటు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
సా..గుతున్న ‘స్వాధీన’ ప్రక్రియ
‘టార్గెట్.. టేకోవర్’ ట్యాగ్‌లైన్‌తో ఎన్వీఎస్ రెడ్డిని స్పష్టంగా ఆదేశించినట్లు మెట్రో వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రాజధాని హైదరాబాద్ నగరంలో రెండో దశ మెట్రో విస్తరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ మేరకు 7 కారిడార్లలో రూ.38,595 కోట్లతో 122.9 కిలోమీటర్ల పనులను ప్రతిపాదించింది. కొత్త కారిడార్లకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్నినెలలుగా కేంద్రం వైపు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే సెకండ్‌ఫేజ్‌లో చేపడుతున్న పలు మార్గాలు మొదటిదశతో అనుసంధానంగా ఉన్నాయి.
దీంతో రెండో దశకు అనుమతులు ఇస్తే సిగ్నలింగ్, నెట్‌వర్క్, టికెట్ షేరింగ్ విషయాల్లో రెండు ప్రాజెక్టుల నడుమ సమస్యలు ఎదురవుతాయని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చింది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ నుంచి మొదటిదశను స్వాధీనం చేసుకుంటే అనుమతులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.15వేల కోట్లతో ఎల్‌అండ్‌టీ నుంచి ప్రాజెక్టును టేకోవర్ చేసుకునేందుకు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో రూ.13,600 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని వాటిని ఎల్‌అండ్‌టీ ఖాతాల్లో జమచేసేందుకు నిర్ణయించింది.
అలాగే రూ.1400 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి బదిలీ చేస్తామని ప్రకటించింది. కాగా, రూ.13,600 కోట్ల రుణాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎ్‌ఫసీ) నుంచి తీసుకునేందుకు నాలుగు నెలల క్రితం మాట్లాడుకుంది. అయితే చివరి నిమిషంలో ఐఆర్‌ఎ్‌ఫసీ రుణం విడుదలపై చేతులెత్తయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం ఎస్‌బీఐ క్యాప్స్‌ను కన్సల్టెన్సీ(మధ్యవర్తి)గా నియమించి జాతీయ, అంతర్జాతీయ బ్యాంకుల నుంచి 3శాతం వడ్డీతో రుణ సమీకరణ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
3 శాతం వడ్డీతో..
మెట్రో టేకోవర్‌కు కావాల్సిన రూ.13,600 కోట్ల రుణాలను కేవలం 3 శాతం వడ్డీతోనే తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కన్సల్టెన్సీ ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించింది. దీంతో సదరు సంస్థ రుణసమీకరణ కోసం పడరాని పాట్లు పడుతోంది. పలు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు 6-7 శాతం వడ్డీతోనే రుణాలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం విధించిన 3శాతం వడ్డీని దృష్టిలో ఉంచుకుని ఎస్‌బీఐ క్యాప్స్‌తో సంప్రదింపులు జరుపుతూ రుణాలు తీసుకురావడం మెట్రో మాజీ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సాధ్యమయ్యేనా.. అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రత్యేక బాధ్యతలు!
ఎన్వీఎస్ రెడ్డి నేతృత్వంలో ప్రపంచంలోనే ప్రైవేట్, పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును నిర్మించారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదించిన నాటి నుంచి దాన్ని పూర్తి చేసే వరకు ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో రెండో దశకు కావాల్సిన రుణాలు, అనుమతుల విషయంలో నెలల తరబడి జాప్యం జరుగుతుండడంతో మెట్రోపై అనుభవం కలిగిన రిటైర్డ్ ఇండియన్ రైల్వే సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి ఎన్వీఎస్ రెడ్డిని మళ్లీ క్షేత్రస్థాయిలోకి తీసుకొచ్చి ప్రత్యేక బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.
మెట్రో మార్గం పొడిగింపు
ప్రస్తుతం నిర్వహణలో ఉన్న మూడు మెట్రో మార్గాల్లో ఐటీ కారిడార్ వరకు ఉన్న నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గం నిర్మాణంలో మెట్రో ఎండీగా ఆయన అత్యంత ముందు చూపుతో వ్యవహరించారు. నాగోల్ నుంచి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వరకే ప్రతిపాదించిన మెట్రో మార్గాన్ని రాయదుర్గం పొడిగించి, దాన్ని యుద్దప్రాతిపదికన పూర్తి చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అప్పగించిన ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేసి ఏడాది లోపే సుమారు 2 కి.మీ మెట్రో మార్గాన్ని పూర్తి చేసి వినియోగంలోకితీసుకువచ్చారు. దీంతో నిత్యం లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఎంతో ప్రయోజనం పొందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అందుకే పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
హ్యాపీ జర్నీ.. ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ నేటి నుంచి అమలులోకి..
Read Latest AP News And Telangana News And International News And Telugu News