చికిత్సకు ముందు-తర్వాత ప్రచారం ఇక కుదరదు!
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:41 AM
‘మా ఆస్పత్రిలో జబ్బు 100 శాతం నయం.. మేం నంబర్ వన్ స్పెషలిస్టులం... నొప్పులు లేని ఆపరేషన్లు... అద్భుత చికిత్స’.. అంటూ రోగులను బురిడీ కొట్టించే ఆస్పత్రులు, వైద్యుల అక్రమ ప్రకటనలకు చెక్ పడనుంది.
ఆస్పత్రులు, వైద్యుల ఫేక్ రివ్యూలు చెల్లవు
నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సు రద్దు: ఎన్‌ఎంసీ
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘మా ఆస్పత్రిలో జబ్బు 100 శాతం నయం.. మేం నంబర్ వన్ స్పెషలిస్టులం... నొప్పులు లేని ఆపరేషన్లు... అద్భుత చికిత్స’.. అంటూ రోగులను బురిడీ కొట్టించే ఆస్పత్రులు, వైద్యుల అక్రమ ప్రకటనలకు చెక్ పడనుంది. వైద్యులు, ఆస్పత్రులకు నకిలీ రివ్యూలు, చికిత్సకు ముందు-తర్వాత ఫొటోలు, రాయితీలు, ఆఫర్లు, సెలబ్రిటీలతో ప్రచారాలు వంటివి చేయకుండా జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తెచ్చింది. ‘ఆస్పత్రులు, వైద్యుల నైతిక ప్రచారం-పబ్లిక్ కమ్యూనికేషన్ మార్గదర్శకాల’తో బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆస్పత్రులు, వైద్యులు.. వారి పేరు, విభాగాలు, సదుపాయాలు, పరికరాలు, అత్యవసర సేవలు, అక్రిడిటేషన్, చికిత్సల చార్జీలు, చిరునామా వంటి వాస్తవ, ధ్రువీకరించదగిన సమాచారాన్ని మాత్రమే ప్రచారం చేసుకోవాలని స్పష్టం చేసింది. వ్యాపార ధోరణిని, సోషల్ మీడియాలో నకిలీ ప్రచారాలను అనుసరించవద్దని పేర్కొంది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించే ఆస్పత్రులు, వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తొలి ఉల్లంఘన కింద హెచ్చరిక, తప్పనిసరి నైతిక శిక్షణ... రెండోసారి ఉల్లంఘనకు భారీ జరిమానా, మూడోసారి ఉల్లంఘిస్తే 3 నుంచి 6 నెలల పాటు రిజిస్ట్రేషన్ (లైసెన్స్) రద్దు వంటి చర్యలు తీసుకుంటామని తెలిపింది.
తీవ్రమైన ఉల్లంఘనలు/వరుస తప్పిదాలకు పాల్పడితే.. వైద్యుల రిజిస్ట్రేషన్, ఆస్పత్రి లైసెన్సును శాశ్వతంగా రద్దు చేస్తామని పేర్కొంది. కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి రోగుల ఫొటోలు, వీడియోలను మార్చి తప్పుడు వివరాలను ప్రచారం చేయడంపై ఎన్‌ఎంసీ నిషేధం విధించింది. సోషల్ మీడియాలో డబ్బులిచ్చి పెట్టించే ఫేక్ రివ్యూలు, రేటింగ్స్, నకిలీ ఫాలోవర్ల వ్యవహారాలపైనా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ఎన్‌ఎంసీ మార్గదర్శకాల్లో కీలక అంశాలివీ..
100 శాతం నయం, నంబర్-1 స్పెషలిస్ట్, గ్యారెంటీ వైద్యం, నొప్పి లేని ఆపరేషన్ వంటి పదాలతో ప్రచారం చేయకూడదు.
డాక్టర్లు, ఆస్పపత్రులు డబ్బులిచ్చి సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో తమ సేవలపై ప్రచారం చేయించకూడదు.
రోగుల వ్యాధి/ఆరోగ్య సమస్యకు ముందు, చికిత్స తర్వాత అని చూపే ఫొటోలు/వీడియోలను ప్రచారం కోసం వాడకూడదు.
ల్యాబ్ పరీక్షలకు, ఆపరేషన్లకు రాయితీలు, క్యాష్‌బ్యాక్‌లు, కూపన్లు ఇస్తూ రోగులను ఆకర్షించడం నిషేధం.
పేషెంట్లను రెఫర్ చేసినందుకు ఏ ఇతర వ్యక్తికి గానీ, సంస్థకు గానీ కమిషన్లు లేదా క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వకూడదు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు డాక్టర్ పేరు, విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ప్రదర్శించాలి.
వైద్య వృత్తి గౌరవాన్ని, నైతిక విలువలను కాపాడాలి, వైద్య రంగం పూర్తిగా వాణిజ్యమయం కాకుండా నిరోధించాలి.
నూతనంగా క్లినిక్ ప్రారంభించినప్పుడు, చిరునామా మారినప్పుడు, లేదా ఫీజుల వివరాలను ప్రకటనల రూపంలో తెలియజేయవచ్చు. మెడికల్ జర్నల్స్‌లో శాస్ట్రీయ పరిశోధన పత్రాలు ప్రచురించవచ్చు.
ఆస్పత్రిలో ఉన్న పరికరాలు, అందుబాటులో ఉన్న స్పెషాలిటీ సేవలు, వైద్యుల వివరాలు, అత్యవసర సేవల సమయాలను సమాచారం రూపంలో వెబ్‌సైట్లలో పెట్టుకోవచ్చు.
ఇతర ఆస్పత్రుల కంటే తామే గొప్ప వంటి ప్రచారం చేయకూడదు.
ఇవి కూడా చదవండి...
సర్కార్ పనితీరు ఎలా ఉంది? ఏది నచ్చింది.. ఏది నచ్చలేదు..
ఓంకారేశ్వరాలయానికి.. రూ.948.65 కోట్లు
అక్టోబరు జీతంతోనే 2 డీఏలు
Read Latest AP News And Telugu News