Share News

ఢిల్లీలో కూలిన 4 అంతస్తుల భవనం

ABN , Publish Date - Oct 08 , 2026 | 03:29 AM

ఢిల్లీలో మళ్లీ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సీమాపూరి ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది.

ఢిల్లీలో కూలిన 4 అంతస్తుల భవనం
delhi building collapse

  • ఏడాదిన్నర పసికందు, గర్భిణి సహా ముగ్గురి మృతి..

  • 8మందికి గాయాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 7: ఢిల్లీలో మళ్లీ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సీమాపూరి ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడాదిన్నర వయసున్న ఓ పసికందు, 4నెలల గర్భిణీ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన 8మందిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద నుంచి తల తెగిపడిన స్థితిలో చిన్నారి మృతదేహాన్ని వెలికితీయడం అక్కడున్న వారిని కలిచివేసింది. గత నెలలో దక్షిణ ఢిల్లీలో ఒక పీజీ హాస్టల్‌ భవనం కుప్పకూలి ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉత్తరాఖండ్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయని, ఈ 20-25ఏళ్ల నాటి భవనానికి పగుళ్లు వచ్చాయని, భవన యజమాని దానిని ఖాళీ చేసే ప్రక్రియలో ఉన్నారని ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. కాగా, సీమాపూరిలో ఉన్న తన తల్లి సల్మా ఇంటికి 4నెలల గర్భిణి గులఫ్సా(21) ఐదేళ్ల కుమారుడితో కలిసి వచ్చింది. భవనం కూలిపోతున్న సమయంలో ఆమె బాత్రూంలో ఉండడంతో శిథిలాల కింద చిక్కుకుపోయింది. శిథిలాల కింది నుంచే బంధువులకు ఫోన్‌ చేసి ‘దాహాంగా ఉంది.. నీళ్లు కావాలి’ అంటూ ఫ్రాధేయపడింది. కొద్దిసేపటి తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు.

Updated Date - Oct 08 , 2026 | 03:31 AM