సీఈసీ, ఈసీల నియామకంపై భిన్నాభిప్రాయ తీర్పును రీకాల్ చేయండి!
ABN , Publish Date - Oct 08 , 2026 | 02:30 AM
ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామక చట్టంపై ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ‘భిన్నాభిప్రాయ తీర్పు’ను రద్దు (రీకాల్) చేయాలని, ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని దాఖలైన పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.

రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించండి
సుప్రీంలో పిటిషన్..పరిశీలిస్తామన్న సీజేఐ
న్యూఢిల్లీ, అక్టోబరు 7: ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామక చట్టంపై ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన ‘భిన్నాభిప్రాయ తీర్పు’ను రద్దు (రీకాల్) చేయాలని, ఈ అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని దాఖలైన పిటిషన్‌ను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లతో కూడిన కమిటీ సీఈసీ, ఈసీల నియామకం చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం 2023 మార్చి 2న ఇచ్చిన తీర్పునకు భిన్నంగా కేంద్రం అదే ఏడాది చట్టం తెచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని, ప్రతిపక్ష నేతను కమిటీలో కొనసాగించి.. సీజేఐ స్థానంలో మాత్రం ప్రధాని నియమించిన కేంద్ర క్యాబినెట్ మంత్రిని చేర్చింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం గత నెల 23న భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది. ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని జస్టిస్ శర్మ అభిప్రాయపడగా.. అవసరం లేదని జస్టిస్ దత్తా పేర్కొన్నారు. భిన్న తీర్పు నేపథ్యంలో ఈ అంశాన్ని విస్తృత లేదా సముచిత ధర్మాసనానికి పంపేందుకు ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఆ తీర్పును రీకాల్ చేయాలని తాము వేసిన పిటిషన్ గురించి సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సీజేఐ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు
ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..