Share News

ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్

ABN , Publish Date - May 28 , 2026 | 06:37 AM

దివంగత మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద గురువారం ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్
Nandamuri Taraka Rama Rao 103rd Birth Anniversary

హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, సినీ దిగ్గజం నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద ఈరోజు (గురువారం) ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సినీ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఉదయం సుమారు 6 గంటల ప్రాంతంలో ఎన్టీఆర్ గార్డెన్‌కు చేరుకుని, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి వినమ్రంగా నమస్కరించారు.


జూనియర్ ఎన్టీఆర్ రాకతో అక్కడ ఒక్కసారిగా అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. తెల్లవారుజామునే భారీ సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు చేరుకొని తమ అభిమాన నటుడిని చూసేందుకు పోటీ పడ్డారు. ‘జై ఎన్టీఆర్ అంటూ అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు అభివాదం చేస్తూ కాసేపు అక్కడ గడిపారు. ఆయన రాకతో ఎన్టీఆర్ జయంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. జూనియర్ ఎన్టీఆర్ రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేశారు.


ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత అని టీడీపీ నేతలు కొనియాడారు. సినీరంగంలో ఎన్నో చారిత్రక పాత్రలు పోషించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని కీర్తించారు. రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజలకు సంక్షేమ పాలన అందించిన నాయకుడిగా ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందని వ్యాఖ్యానించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని టీడీపీ నేతలు తెలిపారు.


ఈ ఏడాది 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. పేదలకు అన్నదానాలు, రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్ సేవలను, జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు

అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 28 , 2026 | 07:38 AM