Share News

మ్యాట్రిమోని సైట్లలో యువతులకు వల.. వెలుగులోకి వెంకట కామేశ్ అరాచకాలు..

ABN , Publish Date - Jun 10 , 2026 | 09:57 PM

మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా పలువురు యువతులను వెంకట కామేశ్ అనే వ్యక్తి మోసం చేశాడు. ఈ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

మ్యాట్రిమోని సైట్లలో యువతులకు వల.. వెలుగులోకి వెంకట కామేశ్ అరాచకాలు..
Matrimony Scam

హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా పలువురు యువతులను వెంకట కామేశ్ అనే వ్యక్తి మోసం చేశాడు. ఈ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో అతడి మోసాల పరంపర బయటపడుతుండగా, బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటివరకు వెంకట కామేశ్‌పై 18 కేసులు నమోదయ్యాయి. వీటిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 6 కేసులు ఉన్నాయి. తాజాగా మరో యువతి ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో మరో కేసు నమోదైంది.


మ్యాట్రిమోని సైట్లలో ఉన్నతవర్గాలకు చెందిన యువతులను.. అదేవర్గానికి చెందిన వాడిగా వెంకట కామేశ్‌ నమోదు చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. తనను రూ.200 కోట్ల ఆస్తులు కలిగిన వ్యాపారవేత్తగా, పాంహౌస్ యజమానిగా, విల్లాల అధిపతిగా చూపిస్తూ ఆకర్షణీయమైన ప్రొఫైళ్లు సృష్టించి పలువురు యువతులను నమ్మించాడు. ఆ తర్వాత వారితో క్రమంగా పరిచయాలు పెంచుకుని, వివాహం పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితుల్లో ఐటీ రంగానికి చెందిన యువతులే అధిక సంఖ్యలో ఉన్నారు.


బాధితుల నుంచి తీసుకున్న డబ్బును గేమింగ్, ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాల్లో వినియోగించినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇటీవల సైబరాబాద్ పోలీసులు వెంకట కామేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అనంతరం మచిలీపట్నంలో నమోదైన మరో కేసు దర్యాప్తు కోసం పీటీ వారెంట్‌పై అతడిని అక్కడి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మంది బాధితులను ఆయన మోసం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా పరిచయమైన వ్యక్తుల వివరాలను పూర్తిగా ధ్రువీకరించుకోవాలని, ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 10:04 PM