Share News

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏది? కాంగ్రెస్‌కు కేటీఆర్ ప్రశ్న

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:07 PM

‘సోనియా గాంధీ గుండెల్లో తెలంగాణ ఉంటే.. ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదు? తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.

సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఏది? కాంగ్రెస్‌కు కేటీఆర్ ప్రశ్న
ktr on sonia gandhi belonging book

హైదరాబాద్, నవంబర్ 17: సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్’ పుస్తకంపై బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటుంటారని.. మరి ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు ఎన్నడూ నిజమైన ప్రేమ లేదని.. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని కేటీఆర్ ఆరోపించారు.


‘సోనియా గాంధీ ఆత్మలో తెలంగాణ లేదు.. గుండెల్లో తెలంగాణ లేదు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దయాభిక్ష కాదు.. తెలంగాణ ప్రజల పోరాట ఫలితం. కేసీఆర్ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అసలు కారణం. తెలంగాణ ప్రజలు సృష్టించిన రాజకీయ అనివార్య పరిస్థితులకు తలొగ్గే కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమ ఉప్పెనలో కొట్టుకుపోతామన్న భయంతోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.

తెలంగాణపై కాంగ్రెస్‌కు ఎన్నడూ నిజమైన ప్రేమ లేదు. సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం.. కాంగ్రెస్ ప్రచారంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం సిగ్గుచేటు’ అంటూ కేటీఆర్ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు.


పీవీ నరసింహారావు కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి.. సోనియాగాంధీ ఆత్మకథపై విమర్శలు గుప్పించారు. ‘పీవీపై అంత ప్రేమ ఉంటే ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదు. తెలంగాణ నాయకత్వం, ప్రజల పట్ల సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ నిజమైన అభిమానం లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ అవసరాల కోణంలోనే చూసింది.

తెలంగాణ సాధనలో ప్రజల త్యాగాలను, కేసీఆర్ నాయకత్వాన్ని విస్మరించే ప్రయత్నం చేస్తూ అబద్దాలను ప్రచారం చేస్తోంది. కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, పోరాటాలు, కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమ ఫలితమే స్వరాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాభిక్ష కాదు.. ప్రజల పోరాటంతో సాధించుకున్న హక్కు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చెరిపివేయలేదు’ అంటూ ఆమె కాంగ్రెస్‌పై మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇళ్ల పథకం లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ ఊరట

ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు.. రైతులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి తుమ్మల

భారత్ సమ్మిట్ వివాదం.. డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన బీజేపీ నేతలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 17 , 2026 | 04:07 PM