రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్.. రెండు లక్షల ఉద్యోగాలు మిథ్య అంటూ విమర్శలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 10:48 AM
యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ విఫలమయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్‌పై యువతకు గల నమ్మకాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేసిందంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
హైదరాబాద్, నవంబరు 26: యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ పబ్లిసిటీ స్టంట్స్ చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో యువతతో మాట్లాడుతూ.. ఫొటోలకు ఫోజులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కాదని.. దార్శనికత, నిబద్ధత ఉండాలని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన తెలంగాణ యువత.. ఇప్పుడు ఉద్యోగాల కోసం పోరాడతారని అన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా విమర్శించారు.
‘రాహుల్ గాంధీ గారూ... మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో మీరు ఒక నాటకానికి తెరలేపారు. నాటకీయ లైటింగ్ మధ్య ఇరానీ చాయ్ తాగుతూ, ఫొటోలకు ఫోజులిస్తూ, ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించారు. మూడేళ్ల తర్వాత అసలు నిజం బయటపడింది! రెండు లక్షల ఉద్యోగాలు ఒక మిథ్య! యువ వికాసం ఒక మిరాజ్. మీ జాబ్ క్యాలెండర్ తెలంగాణ యువత నమ్మకాన్ని అపహాస్యం చేసేలా ఉంది! ఉద్యోగాలు కల్పించడం అంటే ఫొటోషూట్ కాదు. చాయ్ తాగుతూ చేసే పబ్లిసిటీ స్టంట్ అంతకంటే కాదు. ఉద్యోగాలు కల్పించాలంటే దార్శనికత ఉండాలి. కనీసం ఒక్క ఉద్యోగం కల్పించాలన్నా అచంచలమైన నిబద్ధత ఉండాలి.
ఉద్యోగాలు కల్పించడంలో మీరు విఫలమయ్యారు! మీరు, మీ మొత్తం విదూషకుల బృందం తెలంగాణ యువతకు ఏమీ చేయలేరని పదేపదే నిరూపించుకున్నారు. కానీ రాహుల్ గాంధీ గారూ.. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ప్రత్యేక తెలంగాణ కోసం నిరంకుశ కాంగ్రెస్‌తో పోరాడిన యువత మళ్లీ పోరాడగలదు. కాంగ్రెస్ దుష్ట కబంధ హస్తాల నుంచి తెలంగాణను మరోసారి విముక్తి చేయడానికి వారు పోరాడతారు. ఇది కేసీఆర్ గడ్డ! ఇది పోరాట యోధుల గడ్డ. పోరాట యోధులు ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోరు!’ అంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్రమ అండాల కేసులో ఇద్దర్ని కస్టడీకి అప్పగించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాలి: జాన్ వెస్లీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News