హైదరాబాద్‌లో ఆ భూముల ధరలకు రెక్కలు.. గజం రూ.2.70 లక్షలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:28 PM
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో హౌసింగ్ బోర్డు భూములకు భారీ డిమాండ్ వచ్చింది. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో హౌసింగ్ బోర్డు భూములకు భారీ డిమాండ్ వచ్చింది. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లో ఈరోజు (బుధవారం) నిర్వహించిన బహిరంగ వేలంలో 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. ఈ వేలంలో గజం భూమి గరిష్ఠంగా రూ.2.70 లక్షలకు విక్రయించడం హాట్‌టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ వేలం మరోసారి స్పష్టం చేసింది.
అధికారులు నిర్వహించిన ఈ బహిరంగ వేలంలో ఒక్కో గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించగా, వేలంలో పలువురు బిడ్డర్లు పోటీ పడటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. అత్యధికంగా ఒక ప్లాట్ గజం రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. మరో ప్లాట్ గజం రూ.2.36 లక్షలకు విక్రయించారు. అదేవిధంగా మరో రెండు ప్లాట్లు గజం రూ.2.06 లక్షల చొప్పున అమ్ముడయ్యాయి.
ఈ వేలంలో మొత్తం 19 మంది బిడ్డర్లు ఉత్సాహంగా పాల్గొని ప్లాట్ల కోసం పోటీపడ్డారు. ఈ పోటీ కారణంగా హౌసింగ్ బోర్డు నిర్దేశించిన కనీస ధర కంటే అనేక ప్లాట్లు అధిక ధరలకు విక్రయమయ్యాయి. మొత్తం 16 ప్లాట్ల విక్రయం ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది. వేలంలో గజం సగటు ధర రూ.1.79 లక్షలుగా నమోదైంది.
కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్ ఉన్నట్లు ఈ వేలం ద్వారా మరోసారి వెల్లడైందని అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లో కీలకమైన ప్రాంతాల్లో అందుబాటులోని హౌసింగ్ బోర్డు భూములకు కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. భూముల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని హౌసింగ్ బోర్డు ప్లాట్లకు కూడా పోటీ నెలకొంటోందని అన్నారు.
ఈ వేలం ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు హౌసింగ్ బోర్డు అధికారులు వెల్లడించారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయం హౌసింగ్ బోర్డు ఆర్థిక వనరులను పెంచడంలో కీలకంగా మారనుందని తెలిపారు. కేపీహెచ్‌బీ వైస్ చైర్మన్ వీపీ గౌతం మాట్లాడుతూ.. కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్ ఉందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
రాహుల్ గాంధీపై ఆ కేసు నమోదు.. కేంద్రంపై మంత్రి జూపల్లి ధ్వజం
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హై కోర్టులో ఊరట
Read Latest Telangana News And AP News And National News
And Telugu News