Share News

మహిళల హక్కులు, స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్షణ: కవిత

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:20 PM

మహిళల హక్కులు, స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్షణ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మహిళల సాధికారత కోసమే తాను పార్టీ పెట్టానని పేర్కొన్నారు.

మహిళల హక్కులు, స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్షణ: కవిత
Kalvakuntla Kavitha

హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి):మహిళల హక్కులు, స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్షణ అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు. మహిళల సాధికారత కోసమే తాను పార్టీ పెట్టానని పేర్కొన్నారు. పంచాయతీ టు పార్లమెంట్ వరకు మహిళలు జెండా ఎగరవేసే వరకు ఆర్థికంగా, అండగా ఉంటానని భరోసా కల్పించారు. తెలంగాణ రక్షణ సేన మహిళ విభాగానికి తెలంగాణ రుద్రమ సేనగా నామకరణం చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటంలో ఎంతోమంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మహిళలు- రాజ్యాంగ సదస్సు’ జరిగింది. ఈ సదస్సులో కవిత పాల్గొని, ప్రసంగించారు. ఇవ్వాళ మనం రాజ్యాంగ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. నిజానికి మన మహిళలకు దీపావళి, దసరా, క్రిస్మస్, ఈద్ కంటే కూడా ఇవ్వాళే పెద్ద పండుగ రోజని చెప్పుకొచ్చారు. మన రాజ్యాంగం ఆడబిడ్డలకే ఎక్కువ హక్కులు ఇచ్చిందని ప్రస్తావించారు. వేలాది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు అయ్యారంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కేనని ఉద్ఘాటించారు.


ఏళ్లుగా ఆడవాళ్లను ఒక వస్తువుగానే చూస్తూ ఎంతో అవమానిస్తున్నారని కవిత చెప్పారు. మన రాజ్యాంగమే మనల్ని మనుషులుగా గుర్తించిందని తెలిపారు. 1947లో రాజ్యాంగాన్ని ప్రారంభించి నాలుగేళ్లలో మనకు రాజ్యాంగ అమల్లోకి తెచ్చారని వెల్లడించారు. ఆ రాజ్యాంగమే మనల్ని మనుషులుగా గుర్తించిందని అన్నారు. అది మాత్రమే కాదు మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది కూడా మన రాజ్యాంగమేనని చెప్పుకొచ్చారు. అందుకే ప్రతి ఇంట్లో వాళ్ల మత గ్రంథంతో పాటు రాజ్యాంగం ఉండాల్సిందేనని తెలిపారు. ప్రతి మహిళ కచ్చితంగా రాజ్యాంగాన్ని చదవాల్సిందేనని స్పష్టం చేశారు. అప్పుడు మాత్రమే వారికి తమ హక్కులు తెలుస్తాయని చెప్పారు. ఆడబిడ్డలంటే ప్రభుత్వానికి ఎందుకంతా వివక్ష? వాళ్లకు కనీస భద్రత కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.తాను ఏదో టైమ్ పాస్ కోసం పార్టీ పెట్టలేదని చెప్పారు. తెలంగాణ మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు రావాలనే పార్టీ పెట్టానని వెల్లడించారు. మగవాళ్లు మనకోసం ఆలోచించటం లేదని.. మనకు పెన్షన్, బంగారం, సైకిళ్లు ఇస్తామని అంటారని.. కానీ ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు కావాల్సింది ఇళ్లు, జాగ, బ్యాంక్ ఖాతా, ఉద్యోగాలని తెలిపారు.కోటి మంది ఆడవాళ్లను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారని.. కానీ ఆ పరిస్థితి లేదని చెప్పారు.


కుల, మత, ఆడ, మగ అనే తేడా లేకుండా చెరిపేసింది మన రాజ్యాంగం మాత్రమేనని కవిత అన్నారు. రాజ్యాంగం అమలైన రోజే ఆడబిడ్డలకు స్వాతంత్రం వచ్చిందని తెలిపారు. ఇప్పటికీ భూమి, ఇళ్లు ఉన్న ఆడవాళ్లను వేళ్ల మీద లెక్కించవచ్చని చెప్పారు. సినిమాల్లో గానీ కూలీ పనుల్లో కూడా మగవాళ్లతో సమానంగా మనకు వేతనం ఎందుకు ఇవ్వటం లేదు? అని ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగాల్లో కూడా సమాన పనిచేసే ఆడవాళ్లపై కూడా ఎంతో వివక్ష చూపుతున్నారని అన్నారు. ఏ కులంలో, ఏ మతంలోనైనా ఆడవాళ్లపై కచ్చితంగా వివక్ష ఉందని చెప్పారు. వాళ్ల పిల్లల పేర్లు పెట్టే స్వేచ్ఛగానీ పిల్లల పెళ్లిళ్లకు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ గానీ లేదని అన్నారు. డబ్బు, కులం తేడానే లేకుండా అందరీ ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతూనే ఉందని తెలిపారు. ఒక్క రాజ్యాంగం మాత్రమే మనల్ని గుర్తించిందని.. రాజ్యాంగం సరిగా అమలు చేస్తే చాలు మనకు ఏమీ అవసరం లేదని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీలంటే కాస్త ఆడవాళ్ల హక్కుల కోసం పోరాటం చేస్తారని చెబుతారని అన్నారు. కానీ వాళ్లను కూడా ఆ పార్టీలో ఇబ్బంది పెట్టారని, నక్సల్స్‌గా వెళ్లిన మహిళలు కూడా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ‘మనం ఆడ సింహాలమని.. మన చరిత్రను మనమే రాసుకుందాం’ అని కవిత పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి

టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ

నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వరాలు.. రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 26 , 2026 | 06:09 PM