ఇందిరమ్మ ఇళ్ల టవర్ల ప్రాజెక్టులకు రెరా అనుమతులు
ABN , Publish Date - Nov 24 , 2026 | 09:23 AM
తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల టవర్ల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా అనుమతులు లభించాయి.
హౌసింగ్ బోర్డు ప్రాజెక్టులకు తొలిసారి
హైదరాబాద్ సిటీ: తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల టవర్ల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా అనుమతులు లభించాయి. ఈ మేరకు రెరా చైర్మన్ శ్రీనివాసరాజు నుంచి బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం అనుమతుల పత్రాలను అందుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా అనుమతులు పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. క్యూర్ పరిధిలో ఈ పథకం ద్వారా లక్ష ఇళ్లను నిర్మించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది.
తొలివిడతలో పైలట్ ప్రాజెక్టుగా 20 నియోజకవర్గాల్లో సుమారు 12 వేల ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. భూమిని ఉచితంగా అందజేయడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రెరా అనుమతులున్న ప్రాజెక్టులకు బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల ప్రాజెక్టులన్నిటికీ రెరా అనుమతుల కోసం హౌసింగ్ బోర్డు అధికారులు దరఖాస్తు చేశారు. తొలిదశలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులకు రెరా అనుమతులు మంజూరయ్యాయి.
బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఈ ప్లాట్లను పేదలకు రూ.6 లక్షలకే ప్రభుత్వం అందజేస్తున్నందున రెరా చైర్మన్ ప్రత్యేక చొరవ తీసుకొని అనుమతుల జారీని వేగవంతం చేశారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు రెరా అనుమతులు పొందడం హౌసింగ్ బోర్డు చరిత్రలో ఒక మైలురాయి అని వైస్ ఛైర్మన్ విపి గౌతం అన్నారు. ప్రాజెక్టులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..
కరీంనగర్ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?
Read Latest AP News And Telangana News And International News And Telugu News