కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి? 365 వత్తులతో దీపారాధన ఎందుకు చేస్తారో తెలుసా?
ABN , Publish Date - Nov 24 , 2026 | 08:28 AM
కార్తీక మాసం అభిషేక ప్రియుడైన శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి తిథిని పురస్కరించుకుని కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు.
కార్తీక మాసం అభిషేక ప్రియుడైన శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి తిథిని పురస్కరించుకుని కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ రోజున ఆచరించే పూజలు, దీపారాధన, దానధర్మాలు సాక్షాత్తు పరమశివుడికి చేరతాయని పురాణ గాథ.
365 వత్తులతో దీపాలు..
శివుడికి అభిషేకాలు చేసి దీపారాధన చేయడం కార్తీక మాసం ప్రత్యేకత. ముఖ్యంగా పౌర్ణమి రోజున తెల్లవారుజామునే చన్నీటి స్నానం ఆచరించి సూర్యోదయానికి ముందుగానే శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం... ఉసిరి, తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా ఉసిరి దీపాలను కూడా వెలిగిస్తారు. సంవత్సరం పొడుగునా.. దీపారాధన చేయకపోయినా పవిత్ర కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపారాధన చేస్తే చాలని పురాణాలు తెలిపాయి. ఇళ్లలో, దేవాలయాల వద్ద, తులసికోట వద్ద, దేవాలయ ప్రాంగణాల్లో దీపాలను వెలిగిస్తారు. ఈ మాసంలో శివుడిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. అభిషేకాలు చేయడం, బిల్వార్చన, శివ పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తారు.
శివకేశవులకు ప్రీతికరం.. ఈ మాసం..
హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం అంటే శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ రోజున శివకేశవులను ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి. శివునితో పాటు విష్ణుమూర్తిని కూడా విశేషంగా ఆరాధిస్తారు. విష్ణు ఆలయాలను దర్శించడం, విష్ణు సహస్ర నామాలు, అష్టోత్తరాలను పారాయణం చేస్తారు. పవిత్ర స్నానాలు ఆచరించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, దీపారాధన చేయడం, దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.
త్రిపురాంతక రూపంలో శివుడు..
పురాణాల ప్రకారం.. త్రిపురాసురులు తమ శక్తితో దేవతలను, సామాన్యులను వేధించేవారు. దీంతో దేవతలు తమను రక్షించమని మహాశివుడిని ఆరాధిస్తారు. వారి భక్తిని మెచ్చిన భోళాశంకరుడు త్రిపురాంతక రూపాన్ని ధరించి.. ఆ త్రిపురాసురులను అంతం చేస్తాడు. అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అజ్ఞానం పై జ్ఞానం, చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా ఈ రోజు నిలిచిపోయింది. కార్తీక దీపాల కాంతుల్లో లోకంలో ఉన్న అజ్ఞానం అంతా పోవాలని జ్ఞాన జ్యోతులను వెలిగిస్తారు. వెలుగు జ్ఞానానికి, సంపదకు ప్రతీక. ఎక్కడైతే దీపాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు ఉంటారని ప్రతీతి. ఈ పవిత్ర రోజును పురస్కరించుకుని భక్తులంతా దీపారాధన చేస్తారు.
ఈ నైవేద్యాలంటే శివుడికి చాలా ఇష్టం..
కార్తీక మాసం అనగానే గుర్తొచ్చేవి పవిత్ర కార్తీక స్నానాలు, దీపారాధన, అభిషేకాలు, ఉపవాసాలు. శివుడితో పాటు కేశవుని ఇష్టమైన ఈ మాసంలో భక్తులు విశేష పూజలు ఆచరిస్తారు. తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి తులసి లేదా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. దీప దానాలు చేస్తారు.. ఉసిరి దీపాలు వెలిగిస్తారు. వాటితో పాటు శివుడికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. మరి ఆ భోళాశంకరుడికి ఇష్టమైన నైవేధ్యాలేంటో తెలుసుకుందామా..
పరమాన్నం
శివుడికి ఇష్టమైన ప్రసాదాలలో పరమాన్నం ముందువరుసలో ఉంటుంది. బియ్యం, పాలు, బెల్లంతో చేసే ఏ పదార్థమైన ఆ శివుడికి చాలా ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. ముందుగా కప్పు బియ్యాన్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నె తీసుకుని.. నాలుగు కప్పుల పాలు తీసుకుని చిక్కగా మరిగించాలి. పాలు మరిగిన తర్వాత .. బియ్యం వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమంలో బెల్లం పాకాన్ని వేయాలి. నెయ్యి, యాలకుల పొడి , జీడిపప్పు వేసుకోవాలి. అంతే రుచికరమైన పరమాన్నం రెడీ.
చలిమిడి
మహాదేవుడికి ఇష్టమైన ప్రసాదాలలో చలిమిడి ఒకటి. దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా.. ఒక కప్పు బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి రెండు నుంచి మూడు గంటలపాటు నానబెట్టాలి. అనంతరం నీటిని వడకట్టి.. బియ్యాన్ని వేరుచేసి ఆరబెట్టాలి. బియ్యం పూర్తిగా ఆరకముందే.. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో తురుముకున్న బెల్లాన్ని వేసుకుని బాగా కలపాలి. దీనిలో రెండు స్పూన్ల నెయ్యి, యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ముద్దలుగా కలుపుకోవాలి.
పులిహోర
తీపి ప్రసాదాలతో పాటు పుల్లగా ఉండే పులిహోర కూడా శివుడికి చాలా ఇష్టం. ముందుగా అన్నం వండుకుని పక్కకు పెట్టుకోవాలి. మరో గిన్నె తీసుకుని.. చింతపండును నానబెట్టి.. రసం తీయాలి. తరువాత.. కడాయిలో నూనె, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, శనగపప్పు, పల్లీలు, మరియాలు వేసి తాలింపు పెట్టాక.. ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసాన్ని వేసి చిక్కగా మరిగించుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని అన్నంలో బాగా కలుగుని.. కొద్దిసేపు పక్కన పెట్టితే చాలు. రుచికరమైన పులిహోర సిద్ధం.