కార్తీక పౌర్ణమి శోభ.. దేశవ్యాప్తంగా పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు..
ABN , Publish Date - Nov 24 , 2026 | 07:43 AM
దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. పుణ్యస్నానాలకు, దేవుని దర్శనాలకు భక్తులు పోటెత్తారు. పూరీలో స్వర్ణ బేషా, కాశీలో దీపమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఢిల్లీ / హాపూర్ / పూరి, నవంబర్ 24: పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ (మంగళవారం) దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. నదీ తీరాలు, పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు కనుల పండువగా సాగుతున్నాయి.(Kartika Purnima)
హాపూర్ (ఉత్తరప్రదేశ్): కార్తీక పౌర్ణమి సందర్భంగా యూపీలోని హాపూర్ జిల్లా బ్రిజ్ ఘాట్ (Braj Ghat) వద్ద గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
పూరి (ఒడిశా): ఒడిశాలోని పూరి శ్రీ జగన్నాథ ఆలయం ఎదుట భక్తులు వేలాదిగా పోటెత్తారు. కార్తీక పౌర్ణమి ప్రత్యేకత అయిన శ్రీ జగన్నాథుని దివ్య 'స్వర్ణ బేషా' (Swarna Besha - బంగారు అలంకరణ)ను దర్శించుకుని భక్తులు తరించారు.
యమునానగర్ (హర్యానా): హర్యానాలోని యమునానగర్‌లో జరుగుతున్న 'కపాల్ మోచన్ మేళా'లో భాగంగా కార్తీక పౌర్ణమి, గురునానక్ దేవ్ జయంతిని పురస్కరించుకుని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కపాల్ మోచన్ సరోవరంలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
కాశీ విశ్వనాథునికి ప్రత్యేక 'దీపమాల'
వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 26 నుంచి కార్తీక పౌర్ణమి వరకు ప్రతిరోజూ సప్తర్షి హారతి (Saptarishi Aarti) సమయంలో బాబా విశ్వనాథునికి ప్రత్యేకంగా 'దీపమాల' (Deepmala Shringar) నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణమంతా దీపాల కాంతులతో వెల్లివిరుస్తోన్న ఈ ప్రత్యేక అలంకరణ భక్తులకు కనువిందు చేస్తోంది.
కార్తీక పౌర్ణమి విశిష్టత
హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడికి (సుబ్రహ్మణ్య స్వామి) కూడా ఈ రోజు ఎంతో ప్రీతికరమైనది.
దేశవ్యాప్తంగా భక్తులు ఆలయాలను దీపాలతో అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నదులు, చెరువులలో దీపాలతో కూడిన చిన్న పడవలను (కార్తీక దీపాలను) వదులుతూ భక్తిశ్రద్ధలతో పండుగను జరుపుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం
కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట