Share News

ఒమన్‌లో చిక్కుకున్న పహాడీషరీఫ్ మహిళ షబ్నం బేగం సెల్ఫీ వీడియో

ABN , Publish Date - Jul 20 , 2026 | 08:49 AM

హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌కు చెందిన షబ్నం బేగం ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి రప్పించాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది.

ఒమన్‌లో చిక్కుకున్న పహాడీషరీఫ్ మహిళ షబ్నం బేగం సెల్ఫీ వీడియో
Hyderabad Woman in Oman

హైదరాబాద్, జులై 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌కు చెందిన షబ్నం బేగం ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ స్వదేశానికి రప్పించాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ‘దయచేసి నన్ను భారతదేశానికి తీసుకెళ్లండి’ అంటూ ఆమె భావోద్వేగ విజ్ఞప్తి చేసింది. ఉద్యోగం కల్పిస్తామని చెప్పి ఓ ఏజెంట్ తనను ఒమన్‌కు పంపించాడని, అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోయానని షబ్నం బేగం ఆరోపించింది. పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయించారని, అయినప్పటికీ మూడు నెలలుగా జీతం చెల్లించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తనకు మొబైల్ ఫోన్ ఉపయోగించేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపింది.


యజమానుల వేధింపులు, దాడులు భరించలేక చివరకు అక్కడి నుంచి తప్పించుకుని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం (ఇండియన్ ఎంబసీ)లో ఆశ్రయం పొందినట్లు వెల్లడించింది. గత ఎనిమిది రోజులుగా ఎంబసీలోనే ఉంటున్నానని, తనలాంటి పరిస్థితుల్లో మరో 130 మంది మహిళలు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారని పేర్కొంది. తనను ఒమన్‌కు పంపిన ఏజెంట్ పాస్‌పోర్ట్‌ను తీసుకుని తిరిగి ఇవ్వలేదని షబ్నం బేగం ఫిర్యాదు చేసింది. ఈ కారణంగా స్వదేశానికి తిరిగి రావడంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. తన పరిస్థితిని భారత ప్రభుత్వం గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.


ఈ ఘటనను హైదరాబాద్‌కు చెందిన ఎంబీటీ నేత అహ్మదుల్లా ఖాన్ ఎక్స్ వేదికగా భారత విదేశాంగ శాఖ, ఒమన్‌లోని భారత ఎంబసీ దృష్టికి తీసుకెళ్లారు. షబ్నం బేగంను వెంటనే సురక్షితంగా హైదరాబాద్‌కు తరలించాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కోరారు. అలాగే విదేశీ ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ

గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్

టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కి ఈశ్వరమ్మ లేఖ.. ఎందుకంటే

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 09:00 AM