స్వెట్టర్లకు పెరిగిన గిరాకీ
ABN , Publish Date - Nov 19 , 2026 | 10:35 AM
ఎల్‌నినో ప్రభావంతో మొన్నటి వరకు ఉక్కపోత వేడితో ఉక్కిరి బిక్కిరి అయిన నగర ప్రజలకు నవంబరు రెండోవారంలో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు జరిగి చలి ఒక్కసారిగా పెరిగింది. నగరంలో రోజురోజుకు ఊష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం 8 గంటల వరకు విపరీతమైన చలి ఉంటుంది.
దుకాణాల్లో వినియోగదారుల సందడి
హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో మొన్నటి వరకు ఉక్కపోత వేడితో ఉక్కిరి బిక్కిరి అయిన నగర ప్రజలకు నవంబరు రెండోవారంలో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు జరిగి చలి ఒక్కసారిగా పెరిగింది. నగరంలో రోజురోజుకు ఊష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం 8 గంటల వరకు విపరీతమైన చలి ఉంటుంది. సాయంత్రం 5 దాటగానే చలి మొదలవుతుంది. దీంతో ప్రజలు ఒక్కసారిగా చలి నుంచి కాపాడుకోడానికి వివిధ రకాల మార్గాలను వెతుక్కుంటున్నారు. దీంతో ఉలెన్ దుస్తులకు, రజాయ్ వంటి దుస్తులను కొనుగోలు చేయడానికి షాపుల్లోకి ప్రజలు ఎగబడుతున్నారు. చిన్న పిల్లలను చలి నుంచి కాపాడటానికి స్వెట్టర్లను కొనుగోలు చేస్తున్నారు.
దీనికి తోడు శరీరం పొడిబారకుండా కోల్డ్ క్రీమ్, మాయిశ్చరైజ్డ్ లోషన్‌లకు కూడా విపరీతమైన గిరాకీ పెరుగుతోంది. జైపూర్, ఢిల్లీ, యూపీ, పంజాబ్ తదితర ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద ఎత్తున రజాయ్‌లు దిగుమతి అవుతున్నాయి. వీటిని కొనుగోలుచేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దాంతో పాటు బ్లాంకెట్‌లు కూడా అదే స్థాయిలో అమ్ముడవుతున్నాయి. యువత ఎక్కువగా స్వెట్టర్లు, హుడీలు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. హుడీలలో ప్రధానంగా నైక్, రిబాక్, అడిదాస్, వివిధ రకాల హుడీలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. దాంతో పెద్ద పెద్ద మాల్‌లలో విదేశాల నుంచి కూడా హుడీలు దిగుమతి అవుతున్నాయి. స్థాయిని బట్టి కొనుగోలు చేయడానికి వినియోగదారులు షాప్‌లకు వెళుతున్నారు.
జోరుగా ఉలెన్ దుస్తుల విక్రయాలు
చలి పెరగడంతో ఉలెన్ దుస్తులకు ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగాయి. దీంతో వ్యాపారులు డిస్కౌంట్‌లు పెట్టి మరీ ఉలెన్ దుస్తులను విక్రయిస్తున్నారు. షాపుల్లో చిన్న పిల్లలకు సంబంధించిన ఉలెన్ దుస్తులతో పాటు మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఉలెన్ దుస్తులు అమ్ముడుపోతున్నాయి. అల్వాల్, లోతుకుంట, ఈసీఐఎల్, రిసాలాబజార్, బొల్లారం తదితర ప్రాంతాలలో ఉలెన్ దుస్తులను విక్రయిస్తున్నారు.
స్వెట్టర్లు, హుడీలకు అధిక ధరలు
చలికాలంలో బయటకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు స్వెట్టర్లను, హుడీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. స్వెట్టర్ల మీద చూసుకుంటే హుడీలకు ఎక్కువ ధర ఉంటుంది. స్వెట్టర్లు రూ.500 నుంచి రూ.1000 వరకు ఉండగా, హుడీలు వేయి రూపాయల నుంచి బ్రాడెండ్‌ను బట్టి రూ.4 వేల వరకు ధర పలుకుతున్నాయి.
చలి కాలంలో చిన్నారులు జాగ్రత్త
చలి తీవ్రత పెరుగుతుండడం దృష్ట్యా బాలింతలు, చిన్నారులు, నవజాత శిశువులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పౌష్టికాహారంతో పాటు తగినంత విశ్రాంతి అవసరం. చలి నుంచి రక్షణ పొందేందుకు ఉలెన్ దుస్తులను ధరించాలి. వైద్యులు సూచించిన ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం వంటి మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి. చలికాలంలో దాహం వేయదు. అయినా తప్పకుండా నీటిని తాగాలి. లేకుంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కోల్డ్ క్రీమ్, మాయిశ్చరైజ్డ్ క్రీమ్‌లను శరీరానికి రాసుకోవాలి. ఆహార పదార్థాలలో ఎక్కువగా నట్స్, కాజు, పీస్తా, బాదం ఉండే విధంగా చూసుకోవాలి.
ఆనంద్, మేడ్చల్-మల్కాజిగిరి డీఎంహెచ్‌వో
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రతి కుటుంబానికి బీమా.. అందరికీ ధీమా
నీటి పొదుపుపై పాఠశాలల్లో పాఠాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News