Share News

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తోసుకుంటూ యువకుడి పరుగు..

ABN , Publish Date - Nov 19 , 2026 | 08:55 AM

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు కలకలం రేపాడు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండానే టెర్మినల్‌-3లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకుంది.

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తోసుకుంటూ యువకుడి పరుగు..
Delhi Airport

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు కలకలం రేపాడు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండానే టెర్మినల్‌-3లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) అతడిని వెంటనే అదుపులోకి తీసుకుంది. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో విమానాశ్రయంలోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన 25 సెకన్ల వీడియోను సీఐఎస్ఎఫ్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది.


వివరాల్లోకి వెళ్తే.. బుధవారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్‌-3 ప్రవేశ ద్వారం వద్ద సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ యువకుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్లేందుకు సంబంధిత పత్రాలు చూపించాలని భద్రతా సిబ్బంది కోరగా.. అతడు ఒక్కసారిగా వారిని దాటుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, వారిని తోసుకుంటూ ముందుకు పరిగెత్తాడు. దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) రంగంలోకి దిగింది. యువకుడి వెంట పరిగెత్తి క్షణాల్లోనే అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా కొన్ని గుర్తింపు కార్డులు, విద్యార్హత ధ్రువపత్రాలు లభించాయి. అందులో అతడిని హర్యానాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.


అనంతరం నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. చివరికి యువకుడిని అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు యువకుడు ప్రయాణ పత్రాలు లేకుండా విమానాశ్రయంలోకి ఎందుకు ప్రవేశించేందుకు ప్రయత్నించాడనే దానిపై విచారణ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మందుపాతరలను ఢీకొని పేలిపోయిన మూడు చమురు నౌకలు

రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఎస్సై..

Updated Date - Nov 19 , 2026 | 08:59 AM