మందుపాతరలను ఢీకొని పేలిపోయిన మూడు చమురు నౌకలు
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:10 AM
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వైపు ప్రయాణిస్తున్న మూడు చమురు నౌకలు సముద్రపు మందుపాతరలను ఢీకొని పేలిపోయాయి.
టెహ్రాన్, నవంబర్ 19: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇటీవల హోర్ముజ్ జలసంధి వైపు ప్రయాణిస్తున్న పలు నౌకలు సముద్రపు మందుపాతరలను ఢీకొని పేలిపోతున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో మూడు నౌకలు ఇదే తరహా ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకున్నాయి. హోర్ముజ్ జలసంధికి తూర్పు వైపున మూడు చమురు రవాణా నౌకలు సముద్రపు మందుపాతరలను ఢీకొని మంటల్లో చిక్కుకున్నాయని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వెల్లడించింది.
ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్ఐబీ (IRIB) కథనం ప్రకారం.. ఈ మూడు నౌకలు ఇరాన్ నావికాదళం విధించిన ఆంక్షలను ఉల్లంఘించి, నిషేధిత సముద్ర మార్గాల్లో ప్రయాణించాయి. అంతేకాకుండా, నావికాదళ హెచ్చరికలను పట్టించుకోకుండా, నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసి ప్రయాణించాయని ఐఆర్ఐబీ ఆరోపించింది. ఈ క్రమంలో సముద్రంలో ఏర్పాటు చేసిన మందుపాతరలను ఢీకొనడంతో నౌకల్లో మంటలు చెలరేగినట్లు పేర్కొంది. అయితే, ప్రమాదానికి గురైన నౌకల పేర్లు, వాటి దేశాలు, సిబ్బంది పరిస్థితి, మరణించిన వారి సంఖ్య, జరిగిన నష్టం వివరాలను ఐఆర్ఐబీ వెల్లడించలేదు.
మరోవైపు, ఇరాన్‌లోని ఖెష్మ్ ద్వీపంలో ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణి ప్రయోగ కేంద్రంపై అమెరికా సైన్యం దాడులు జరిపింది. బహ్రెయిన్‌లోని తమ సైనిక స్థావరంపై ఇరాన్ గతంలో జరిపిన దాడికి ప్రతిస్పందనగా ఈ చర్య చేపట్టినట్లు అమెరికా సైనిక అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదే సమయంలో బహ్రెయిన్‌లోని అమెరికా రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
కాగా, ప్రపంచ చమురు రవాణాలో హోర్ముజ్ జలసంధికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో సుమారు ఐదో వంతు ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ఈ ప్రాంతంలో నౌకలపై దాడులు, సముద్రపు మందుపాతరల ముప్పు కొనసాగితే అంతర్జాతీయ చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
50 ఏళ్లు.. 2590 కోట్ల కిలోమీటర్లు