Share News

50 ఏళ్లు.. 2590 కోట్ల కిలోమీటర్లు

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:39 AM

దాదాపు యాభై ఏళ్ల క్రితం.. 1977లో నాసా ప్రయోగించిన వాయేజర్‌ 1 వ్యోమనౌక నిజంగానే రోదసిలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది.

50 ఏళ్లు.. 2590 కోట్ల కిలోమీటర్లు
space

  • భూమి నుంచి ఒక ‘కాంతి దినం’ దూరానికి చేరుకున్న వాయేజర్‌ 1

  • ఇందుకు ఆ వ్యోమనౌకకు పట్టిన సమయం 49 ఏళ్ల 2 నెలల 11 రోజులు

  • భూమి నుంచి రోదసిలో అంత దూరంలో ఉన్న మానవ నిర్మిత వస్తువు అదే

  • వాయేజర్‌ 1లో గోల్డెన్‌ డిస్క్‌..

  • ఏలియన్స్‌కు 55 భాషల్లో శుభాకాంక్షలు

  • ఆ 55 భాషల్లో.. తెలుగు, కన్నడ, హిందీ సహా తొమ్మిది భారతీయ భాషలు

సెంట్రల్‌ డెస్క్‌: దాదాపు యాభై ఏళ్ల క్రితం.. 1977లో నాసా ప్రయోగించిన వాయేజర్‌ 1 వ్యోమనౌక నిజంగానే రోదసిలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. 1977 సెప్టెంబరు 5న నాసా ప్రయోగించిన ఈ వ్యోమనౌక.. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 3.46 గంటలకు భూమి నుంచి ఒక ‘కాంతి దినం(లైట్‌ డే)’ దూరానికి చేరుకుంది. ఒక కాంతి దినం అంటే.. శూన్యంలో కాంతి 24 గంటల్లో ఎంత దూరం ప్రయాణించగలదో అంత దూరం. అది ఎంతంటే.. అక్షరాలా 2,590 కోట్ల కిలోమీటర్లు! అక్కడితో ఆగలేదది.. గంటకు 61 వేల కిలోమీటర్ల వేగంతో ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌లో ఇంకా దూసుకుపోతూనే ఉంది. ప్రస్తుతం భూమి నుంచి రోదసిలో అత్యంత దూరంలో.. ఉన్న మానవ నిర్మిత వస్తువు ఇదే. 1965లో నాసా.. మారినర్‌ 10 వ్యోమనౌక బుధ, శుక్ర గ్రహాల మీదుగా ప్రయాణించడానికి గురుత్వాకర్షణ శక్తి సహాయాన్ని (గ్రావిటీ అసిస్ట్‌ను) ఎలా వినియోగించాలో లెక్కిస్తుండగా ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. అదేంటంటే.. 1976 నుంచి 1978 మధ్య గురు, శని, యురేనస్‌, నెఫ్ట్యూన్‌ గ్రహాలు సూర్యుడికి ఒకే వైపున, ఒకే వరుసలో వస్తాయని.. అలాంటి అరుదైన అమరిక మళ్లీ రావాలంటే అందుకు మరో 176 ఏళ్లు పడుతుందని తేలింది.


దీంతో ఆయాగ్రహాలగురుత్వాకర్షణశక్తినిఉపయోగించుకునేలా వ్యోమనౌకలను ప్రయోగిస్తే.. తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్తాయని, భూమి నుంచి నెఫ్ట్యూన్‌కు ప్రయాణ సమయాన్ని 20 సంవత్సరాలు తగ్గించవచ్చని శాస్త్రజ్ఞులు గుర్తించారు. గ్రావిటీ అసిస్ట్‌ను ఉపయోగించుకుంటే ఒక్క మిషన్‌తో నాలుగు గ్రహాలనూ సందర్శించవచ్చని వారికి అర్థమైంది. అలా మొదలైనవే వాయేజర్‌ 1, వాయేజర్‌ 2 ప్రాజెక్టులు. వీటిలో వాయేజర్‌ 1 వ్యోమనౌక పని గురు, శని గ్రహాలను సందర్శించడం. వాయేజర్‌ 2ని.. యురేనస్‌, నెఫ్ట్యూన్లకు వెళ్లేలా ప్రణాళికలు రచించారు. వీటిలో తొలుత వాయేజర్‌ 2ని.. 1977 ఆగస్టు 20న రోదసిలోకి పంపారు. ఆ తర్వాత పదహారు రోజులకు.. సెప్టెంబరు 5న వాయేజర్‌ 1 బయల్దేరింది. శాస్త్రజ్ఞులు ముందే రచించిన ప్రణాళిక ప్రకారం, నిర్దేశిత మార్గంలో దూసుకెళ్లిన ఆ వ్యోమనౌక 1979 మార్చి 5న గురుగ్రహానికి సమీపంగా వెళ్లింది. 1980 నవంబరు 12న శనిగ్రహానికి దగ్గరగా వెళ్లింది. 2012 ఆగస్టులో సూర్యుని ప్రభావ పరిధిని దాటి ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌లోకి ప్రవేశించిన మొదటి మానవ నిర్మిత వస్తువు/వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది. మొదట్లో నాలుగేళ్లనుకున్న దాని ప్రయాణం.. ఇన్నేళ్ల తర్వాత కూడా.. ఇంటర్‌స్టెల్లార్‌ స్పేస్‌లో సైతం అప్రతిహతంగా సాగిపోతోంది. ఇక.. దానికన్నా ముందు బయల్దేరిన వాయేజర్‌ 2 నిదానంగా ప్రయాణిస్తూ 1986 జనవరి 24న యురేన్‌సకు, 1989 ఆగస్టు 25న నెఫ్ట్యూన్‌కు దగ్గరగా వెళ్లింది. ఇప్పుడు అది మనకు 2,160 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది.


sp4.jpgగ్రహాంతరవాసులకు తెలుగు శుభాకాంక్షలు

వాయేజర్‌1లో పొందుపరచిన

గోల్డెన్‌ డిస్క్‌లో మన తాజ్‌మహల్‌ చిత్రం..

జాత్‌ కహాఁహో గీతం

వాయేజర్‌ 1 వ్యోమనౌకను రోదసిలోకి పంపేటప్పుడే నాసా శాస్త్రజ్ఞులు దాంట్లో శాస్త్ర, సాంకేతిక పరికరాలతోపాటు.. ఒక గోల్డెన్‌ రికార్డ్‌ కూడా పంపారు. గోల్డెన్‌ అంటే నిజంగా బంగారంతో తయారుచేసింది కాదు. పసిడి పూత పూసిన 12 అంగుళాల రాగి డిస్క్‌ అది. డీవీడీ డిస్క్‌లాంటిది అనుకోండి. ఒకవేళ.. ఈ వ్యోమనౌక వెళ్లే దారిలో గ్రహాంతరజీవులెవరైనా తారసపడితే (లేదా) ఈ వ్యోమనౌక వారుండే చోటుకు చేరితే.. వారికి మన భూగ్రహం గురించి తెలిపే పలు వివరాలను శాస్త్రజ్ఞులు ఆ డిస్క్‌లో పొందుపరిచారు. ఏలియన్స్‌కు మానవుల తరఫున 55 భాషల్లో శుభాకాంక్షలు తెలిపే ఆడియోలు, వివిధ సంస్కృతులకు సంబంధించిన సంగీతం, భూమి గురించి మానవుల గురించి తెలిపే 115 ఛాయాచిత్రాలు (ఆడియో తరంగాల రూపంలో, అనలాగ్‌ పద్ధతిలో పొందుపరచారు), పక్షుల కూతలు.. ఆ డిస్క్‌లో ఉన్నాయి. ఫొటోల్లో.. తాజ్‌మహల్‌, చైనా గోడ, సిడ్నీ ఒపేరా హౌస్‌, గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జ్‌ వంటి అద్భుత కట్టడాలూ ఉన్నాయి. ప్రముఖ భారతీయ గాయని కేసర్‌భాయ్‌ కేర్కర్‌ పాడిన ‘జాత్‌ కహాఁహో’ గీతం కూడా ఆ డిస్క్‌లో పొందుపరిచారు. అలాగే.. శుభాకాంక్షల్లో మన దేశానికి చెందిన తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, పంజాబీ, రాజస్థానీ, ఉర్దూ భాషలవి ఉన్నాయి. తెలుగు శుభాకాంక్షలను.. అప్పటికి అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీలో చదువుతున్న ‘ప్రసాద్‌ కొడుకుల’ రికార్డ్‌ చేశారు. ‘‘నమస్తే.. తెలుగు మాట్లాడే జనమున నుంచి మా శుభాకాంక్షలు’’ అంటూ ఆయన చెప్పిన శుభాకాంక్షలు ఆ డిస్క్‌లో 4 నిమిషాల 1 సెకను వద్ద వినిపిస్తాయి. నాసా వెబ్‌సైట్‌లో.. వాయేజర్‌ 1 గోల్డెన్‌ డిస్క్‌ విభాగంలోకి వెళ్తే అన్ని భాషల శుభాకాంక్షలూ వినొచ్చు.

ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్‌కు అఖిలేశ్ యాదవ్ షాకిచ్చారా.. కేవలం 24 సీట్లే ఇస్తామంటూ ఆఫర్..

జంతుబలులను నిషేధించాలంటూ పిటిషన్‌.. కొట్టివేసిన సుప్రీంకోర్టు

Updated Date - Nov 19 , 2026 | 05:57 AM