రోజుకు 8000 ట్యాంకర్లు..
ABN , Publish Date - Mar 26 , 2026 | 07:49 AM
హైదరాబాద్ మహానగరంలో రోజుకు 8వేల వరకు వాటర్‌బోర్డు ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేస్తున్నారు. ఎండలు ముదరడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి అవసరాలు పెరిగాయి.
నగరంలో పెరిగిన నీటి డిమాండ్
ఎండలు ముదరడంతో పెరిగిన బుకింగ్‌లు
భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్డుపై ఆధారం
తాజా వర్షంతో కొంత వరకు ఉపశమనం
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహానగరంలో రోజుకు 8వేల వరకు వాటర్‌బోర్డు ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేస్తున్నారు. ఎండలు ముదరడం, భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో నీటి అవసరాలు పెరిగాయి. హోటల్స్, పలు వాణిజ్య సముదాయాలు, నల్లా కనెక్షన్ లేని భవనాలు ప్రైవేటు ట్యాంకర్లను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. అయితే తాజాగా కురిసిన వర్షంతో కొంత వరకు నీటి డిమాండ్‌కు ఉపశమనాన్ని కలిగిస్తుందని అధికారులు అంటున్నారు.
30 ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్
జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజు విడిచి రోజు, శివారు ప్రాంతాల్లో నాలుగైదు రోజులకోసారి వాటర్‌బోర్డు నీటిని సరఫరా చేస్తోంది. వాటర్‌బోర్డు నీరు నగర వాసుల తాగునీటి అవసరాలను మాత్రమే తీర్చుతుండగా, అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేవారికి బోరు నీరు అవసరాలను తీరుస్తోంది. వేసవి వచ్చేసరికి బోర్లు వట్టిపోవడంతో నగర వాసులకు వాటర్‌బోర్డు సరఫరా చేసే నీరే ఆధారమవుతోంది. వాటర్‌బోర్డు జలాలు తాగునీటికి ఇంటి అవసరాలకు సరిపోకపోవడంతో ట్యాంకర్లను బుక్ చేసుకునే పరిస్థితి గ్రేటర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్నది. నగరంలోని మాదాపూర్, కొండాపూర్, జూబ్లీహిల్స్(Madhapur, Kondapur, Jubilee Hills), హఫీజ్‌పేట, మియాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఎస్‌ఆర్ నగర్, యూసఫ్‌గూడ, బంజారాహిల్స్, నిజాంపేట, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ తదితర 30 ప్రాంతాల్లోనే ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉన్నట్లు తెలిసింది.
ఎండలు ముదరడంతో..
గతేడాది జనవరి నుంచే ట్యాంకర్ల బుకింగ్ పెరగగా, ఈ ఏడాది మార్చి నెలలో ట్యాంకర్ల బుకింగ్‌లు అధికంగా మొదలయ్యాయి. మార్చి మొదటివారంలో రోజుకు 5వేలకు పైగా ట్యాంకర్లు బుక్ కాగా, మూడో వారానికే రోజుకు 8వేలకు పైగా అవుతున్నాయి. ఏప్రిల్ మొదటివారంలో రోజుకు 10వేలకు పైగా ట్యాంకర్లు బుక్ అయ్యే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజువారీగా బుకింగ్ అవుతున్న 8వేలకు పైగా ట్యాంకర్లను 24గంటల్లోనే డెలివరీ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సీఎం రేవంత్ కేరళ పర్యటన రద్దు
ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Read Latest Telangana News and National News