సర్.. హైదరాబాద్ పార్లమెంట్ బెటర్
ABN , Publish Date - Jul 22 , 2026 | 09:08 AM
హైదరాబాద్ జిల్లాలోని ఓ పార్లమెంట్ పరిధిలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) జోరుగా సాగుతుండగా.. మరో పార్లమెంట్ పరిధిలో నామ్ కే వాస్తేగా జరుగుతోంది.
ఏడు నియోజకవర్గాల్లో..ఆరు చోట్ల 42 నుంచి 49శాతం
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో అంతంతే
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ జిల్లాలోని ఓ పార్లమెంట్ పరిధిలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) జోరుగా సాగుతుండగా.. మరో పార్లమెంట్ పరిధిలో నామ్ కే వాస్తేగా జరుగుతోంది. జిల్లాలో 47.36 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికీ ఎన్యుమరేషన్ ఫారం అందగా, 20.34 లక్షల మంది తిరిగి బూత్ లెవల్ ఆఫీసర్ల (బీఎల్‌ఓ)కు అందజేశారు.
ఇప్పటి వరకు 43 శాతం ఫారాల డిజిటైజేషన్ జరిగిందని మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఏడు శాసనసభ స్థానాలు హైదరాబాద్ పార్లమెంట్, మరో ఏడు అసెంబ్లీలు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఈ రెండు పార్లమెంట్‌ల్లో సర్ ప్రక్రియను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో అత్యధికంగా ఫారాల సేకరణ జరిగింది.
హైదరాబాద్ పార్లమెంట్‌లో అధికం
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఫారాల డిజిటలైజేషన్ 44.64 శాతం ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 41.30 శాతంగా ఉంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 3.34 శాతం అదనంగా ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ జరిగింది. జిల్లా సగటు సుమారు 43 శాతంగా ఉంది. పార్లమెంట్ పరిధిలోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీలో అత్యధికంగా 49.36 శాతం ఫారాల డిజిటైజేషన్(సేకరణ, ఆన్‌లైన్ అప్‌లోడ్) జరిగింది.
ఇది జిల్లాలోనే అత్యధికం. ఇదే పార్లమెంట్ పరిధిలోని బహదూర్‌పురాలో 48.18, కార్వాన్‌లో 45.91, గోషామహల్‌లో 42.94 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఈ పార్లమెంట్‌లో అత్యల్పంగా మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 38.24 శాతం డిజిటైజేషన్ జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంట్‌లోని నాంపల్లి అసెంబ్లీలో అత్యధికంగా 45.67, సికింద్రాబాద్‌లో 45.57 శాతం డిజిటైజేషన్ జరుగగా.. ఇక్కడి మెజార్టీ నియోజకవర్గాల్లో డిజిటైజేషన్ శాతం 40లోపు ఉండడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు మరింత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
‘ఇందిరమ్మ ఇళ్ల’తో సర్కారు కొత్త నాటకం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News