‘ఇందిరమ్మ ఇళ్ల’తో సర్కారు కొత్త నాటకం!
ABN , Publish Date - Jul 22 , 2026 | 05:59 AM
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాటకానికి తెరతీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే..
లక్షలాది మంది అర్హులుంటే
7 వేల ఫ్లాట్లకే నోటిఫికేషనా?
ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ
గతంలో నిర్మించిన ఇళ్లు అర్హులకు ఇవ్వాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాటకానికి తెరతీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. సర్కారు ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ‘ఆర్థిక దోపిడీ’ అని విమర్శించారు. గతంలో నిర్మించిన ఇళ్లను అర్హులైన పేదలకు ఉచితంగా కేటాయించాలని, పాత ఇళ్లు పంపిణీ కాకపోవడంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలో 24 నియోజకవర్గాల్లో లక్షలాది మంది అర్హులు ఉంటే, కేవలం 7,680 ఫ్లాట్లకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని.. ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.100 రుసుముతో పాటు రూ.10 వేలు ఈఎండీ వసూలు చేయడం దారుణమని విమర్శించారు. ఈ ప్రక్రియ ద్వారా పేదల నుంచి దాదాపు రూ.1000 కోట్లు వసూలు చేయడానికి కుట్ర పన్నారని.. ఇది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పేరుతో చేసిన డిపాజిట్ల దోపిడీని గుర్తు చేస్తోందని చెప్పారు. ‘‘గతంలో వైఎస్ హయాంలో జవహర్‌నగర్, పోచారం, చందానగర్, గాజులరామారం టౌన్‌షి్‌పలతో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో భోలక్‌పూర్, జవహర్‌నగర్‌లలో నిర్మించిన వందలాది డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. వీటికి మరమ్మతులు చేసి పేదలకు ఇవ్వకపోవడం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద ఇస్తున్న నిధులు, సబ్సిడీలను వాడుకుంటూ, రూ.11 లక్షలకు ఇల్లు ఇస్తున్నామని కాంగ్రెస్ సర్కారు ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే’’ అని స్పష్టం చేశారు.