సాఫీగా.. వేగంగా.. ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 10:47 AM
హైదరాబాద్ మెట్రో ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తయింది. శనివారం పదోయేట అడుగుపెడుతోంది.
మెట్రో రైలు ప్రారంభించి నేటికి 9 ఏళ్లు పూర్తి
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మెట్రో ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తయింది. శనివారం పదోయేట అడుగుపెడుతోంది. నగరంలో ట్రాఫిక్ రహితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో 2012లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఎల్‌బీనగర్-మియాపూర్, జేబీఎస్-ఫలక్‌నుమా, నాగోల్- రాయదుర్గం కారిడార్లలో రూ.14,132 కోట్ల వ్యయంతో 72 కిలోమీటర్ల మేర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల పరిధిలో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు రైళ్లు తిరుగుతున్నాయి.
రోజూ 4.60-4.80 లక్షల మంది ప్రయాణం
ఎల్‌బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గ్ కారిడార్లలో ప్రతీరోజు విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ఈ రెండు మార్గాల నుంచి హైటెక్‌సిటీ, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, తదితర ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలకు వెళ్లేందుకు ఉద్యోగులు పెద్ద ఎత్తున మెట్రోను ఆశ్రయిస్తున్నారు. మూడు కారిడార్లలో రోజువారీగా 4.60 లక్షల నుంచి 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. శని, ఆదివారాలతోపాటు పండగల సమయంలో 5 లక్షల మార్కును దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
రెండో దశ ప్రాజెక్టు విస్తరణపై ఆసక్తి
మెట్రో రెండో దశ ప్రాజెక్టు విస్తరణపై నగరవాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రూ.38,595 కోట్లతో పార్ట్-ఏ కింద 7 కారిడార్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన డీపీఆర్ అనుమతిలో ఆలస్యం జరుగుతుండడంతో వేచిచూస్తోంది. ఎల్‌అండ్‌టీ నుంచి మొదటిదశ ప్రాజెక్టు పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాతనే 7 కారిడార్ల డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టేకోవర్‌కు కావాల్సిన రూ.13,600 కోట్ల రుణ సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఉమ్మడి పాస్‌కు ఆదరణ
మెట్రో, ఆర్టీసీకి కలిపి తీసుకొచ్చిన ఉమ్మడి పాస్‌కు ఆదరణ లభిస్తోంది. దీపావళి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రయాణ పాస్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ.400గా ఉన్న రోజువారీ పాస్ ధరను రూ.275, రూ.8,500గా ఉన్న నెలవారీ పాస్ రూ. 4,000కు తగ్గించారు. ప్రస్తుతం నెలవారీ పాస్‌లు 40 వరకు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
94.2 కోట్ల మంది ప్రయాణం
2017 నవంబరు 28న ప్రధాని నరేంద్రమోదీ నగరంలో మెట్రోరైళ్లను అధికారికంగా ప్రారంభించారు. మరుసటి రోజు నుంచి మూడు కారిడార్లలో రైళ్లు పట్టాలెక్కాయి. మూడు కారిడార్లలో 2018 నవంబరు 28 నాటికి 3 కోట్ల ప్రయాణాలు జరిగాయి. 2024 మే నాటికి 50 కోట్ల ప్రయాణాలు, 2024 నవంబరు నాటికి 63.5 కోట్ల మంది ప్రయాణించారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో 86 కోట్ల మంది ప్రయాణించినట్లు పేర్కొంది. ఈ ఏడాది నవంబరు 26 వరకు 94.2 కోట్ల మంది రాకపోకలు సాగించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. మూడు కారిడార్లలో 57 స్టేషన్ల నుంచి రోజూ 1,100 సర్వీసులు నడుస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. భారీగా పెరిగిన బంగారం ధర
జనవరి 2నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News