Share News

టోల్ ఎగవేతకు నంబర్ ప్లేట్లు దాస్తే ఐదు రెట్ల జరిమానా

ABN , Publish Date - Nov 28 , 2026 | 07:33 AM

బారియర్‌‌ఫ్రీ టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు ఉద్దేశపూర్వకంగా వాహనాల నంబర్‌ ప్లేట్లను దాస్తే, ఇకపై భారీ జరిమానా తప్పదు. నంబర్ ప్లేట్లను కప్పి ఉంచడం, వాటిని ట్యాంపర్ చేయడం వంటి చర్యలకు పాల్పడే వాహనదారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.

టోల్ ఎగవేతకు నంబర్ ప్లేట్లు దాస్తే ఐదు రెట్ల జరిమానా

ఇంటర్నెట్ డెస్క్: బారియర్‌‌ఫ్రీ టోల్‌ ప్లాజాల వద్ద టోల్‌ ఎగవేత కోసం వాహనాల నంబర్‌ ప్లేట్లను దాస్తే, ఇకపై భారీ జరిమానా తప్పదు. నంబర్ ప్లేట్లను కప్పి ఉంచడం, వాటిని ట్యాంపర్ చేయడం వంటి చర్యలకు పాల్పడే వాహనదారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. అలా చేస్తే ఐదు రెట్ల టోల్‌ చార్జీని జరిమానాగా విధిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ప్రకటించింది. అసలు టోల్‌ మొత్తానికి ఈ జరిమానా అదనం. ఉదాహరణకు రూ.100 టోల్‌ చెల్లించాల్సిన వాహనదారుడు టోల్‌ ఎగవేతకు పాల్పడితే రూ.500 జరిమానాతో పాటు అసలు టోల్‌ రూ.100 కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.600 చెల్లించాలి. అలాగే టోల్‌ చెల్లింపుల నుంచి తప్పించుకునేందుకు వాహనాలకు ఫాస్టాగ్‌లు అమర్చకపోయినా ఈ జరిమానా వర్తిస్తుంది. టోల్‌ చెల్లింపులను ఉద్దేశపూర్వకంగా ఎగవేసినట్లు నిర్ధారణ అయిన సందర్భాల్లోనే ఈ జరిమానా విధిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మల్టీ లేన్‌ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్) టోల్‌ ప్లాజాలతో పాటు భవిష్యత్తులో ఏర్పాటు చేయనున్న ప్లాజాలకూ ఈ నిబంధనను వర్తింపజేయనున్నారు.


టోల్‌ ఎగవేతను ఇలా గుర్తిస్తారు

ఎంఎల్ఎఫ్ఎఫ్ విధానంలో టోల్‌ చెల్లించేందుకు వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు. రహదారిపై ఏర్పాటు చేసిన ఓవర్‌హెడ్‌ గ్యాంట్రీలపై అమర్చిన ఫాస్టాగ్‌ రీడర్లు, ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌ కెమెరాల ద్వారా టోల్‌ వసూలు చేస్తారు. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత 'వెహికల్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌' విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వాహన రిజిస్ట్రేషన్‌ డేటాబేస్‌ అయిన వాహన్‌ సమాచారంతో అనుసంధానించి నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను, వాటి యజమానులను గుర్తిస్తారు. కాగా.. దేశంలో తొలి బారియర్‌‌ఫ్రీ టోల్‌ ప్లాజాను గుజరాత్‌లోని చోర్యాసీ వద్ద ఈ ఏడాది మే 1న ప్రారంభించారు. అనంతరంఢిల్లీలోని ముండ్కా టోల్‌ ప్లాజా సహా మరో ఎనిమిది ప్రాంతాలకు అలాంటి ప్లాజాలను విస్తరించారు.


ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ లేకపోతే?

ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్‌ లేకపోతే దానిని ఉద్దేశపూర్వక టోల్‌ ఎగవేతగా పరిగణించరు. అలాంటి సందర్భాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వాహనదారులకు ఎలక్ట్రానిక్‌ నోటీసులు జారీ చేస్తారు. నోటీసు అందిన 72 గంటల్లోపు టోల్‌ చెల్లిస్తే సాధారణ టోల్ చార్జీ మాత్రమే డెబిట్ అవుతుంది. ఆ గడువు దాటితే చెల్లించాల్సిన మొత్తం రెట్టింపు అవుతుంది.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 07:43 AM