Share News

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 27 , 2026 | 08:49 PM

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందడం ద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu

ఢిల్లీ, నవంబర్ 27: డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తున్నానని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. చారిత్రాత్మక ఘట్టం వైపు ఉండాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లో తీసుకునే నిర్ణయాల్లో మహిళలు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ఏకగ్రీవంగా అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. బిల్లు పాస్ కాకుండా ఎవరైనా అడ్డుపడితే వారిపై మహిళల ఆగ్రహం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. మహిళాల పక్షాన ఉండాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు.


చారిత్రాత్మక బిల్లులు క్యాబినెట్ ఆమోదం పొందినందుకు సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సౌత్ ఇండియా జనాభా తగ్గుతుందని చెప్పారు. నంబర్ పెరుగుతుంది.. మన వాయిస్ తగ్గే పరిస్థితి లేదని అన్నారు. ఈ బిల్లులు సౌత్ ఇండియాకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళల అభివృద్ధి కొరకు పని చేస్తుందని తెలిపారు. ఇటీవల ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 కార్పొరేషన్లలో 8 మహిళలకు ఇచ్చామని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా టీడీపీ హయంలో చట్టము తీసుకొచ్చామని వివరించారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే విపక్షాలు ఆందోళన చేశాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఒక చారిత్రాత్మక కార్యక్రమానికి మద్దతు తెలపడానికి తాను న్యూఢిల్లీ వచ్చానని అన్నారు. ఇది 'సబ్ కా సాత్, సబ్ కా వికాస్' (అందరితో కలిసి, అందరి అభివృద్ధి) అనే స్ఫూర్తికి నిదర్శనమని అభివర్ణించారు. కేంద్రాన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల అంశం మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. దీనికి తాను స్వయంగా సాక్షిని, ఇప్పుడు ఇది కార్యరూపం దాల్చుతోంది, దేశంలో కొత్త ఆశలను చిగురింపజేస్తోందని తెలిపారు. ఇప్పుడు సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే ప్రతిపాదన వచ్చిందని పేర్కొన్నారు. నిన్నటి వరకు తమకు ఎంతో ఆందోళన ఉండేదని అన్నారు.


1971, 2011 లేదా 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే, దక్షిణ భారతదేశానికి పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రారంభ దశలోనే తాము కుటుంబ నియంత్రణను అమలు చేశామని అన్నారు. ప్రస్తుతం ఏపీలో (ఫెర్టిలిటీ రేటు) 1.6%గా ఉంది, కానీ జనాభా స్థిరీకరణకు అవసరమైన స్థాయి (రీప్లేస్‌మెంట్ లెవల్) 2.1%గా ఉండాలని వివరించారు.


దక్షిణ భారతదేశం అంతా ఇదే సమస్యను ఎదుర్కుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే, తాను జనాభా పెంపునకు పిలుపునిచ్చానని చెప్పారు. అంటే పెద్ద కుటుంబాలకు ప్రోత్సాహకాలు కల్పించడం, ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రోత్సహించడం చేయాల్సి ఉందని అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే చర్యను చేపట్టిందని సీఎం చంద్రబాబు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్: ఎస్ఈసీ

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 27 , 2026 | 09:13 PM