త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా
ABN , Publish Date - Nov 27 , 2026 | 07:21 PM
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు త్వరలో ప్రారంభమవుతాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడించారు. ఈ హాస్పిటల్‌లో అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 27: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు త్వరలో ప్రారంభమవుతాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా వెల్లడించారు. ఈ హాస్పిటల్‌లో అన్ని రకాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. త్వరలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రజలకు అంకితం చేయనున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య సేవలపై అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల హాజరు తక్కువగా ఉండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని డీసీహెచ్‌ఎస్‌లను ఆదేశించారు. ఇటీవల 1,616 మంది వైద్యులను సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో నియమించామని గుర్తు చేశారు.
90 శాతం వైద్య సేవలు స్థానికంగానే అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పష్టం చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మెడికల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లు, డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లను హెచ్చరించారు. సికిల్ సెల్ అనీమియా, తలసేమియా, హిమోఫిలియా కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
జిల్లాల్లోని బస్తీ దవాఖాన్లకు సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్ నుంచే మందుల సరఫరా చేస్తామని చెప్పారు. అన్ని సబ్ సెంటర్లను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. త్వరలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాను పర్యటిస్తానని అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. అప్పటిలోగా ఆసుపత్రుల పనితీరు మెరుగుపడాలని అధికారులను మంత్రి రాజనర్సింహా ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ స్పెషల్ ఆఫీసర్‌గా అర్జా శ్రీకాంత్ నియామకం.. 4 రాష్ట్రాల్లో అదనపు బాధ్యతలు
ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్: ఎస్ఈసీ