సంగారెడ్డి జిల్లాలో భారీ మోసం.. రూ.28 కోట్ల డిపాజిట్లతో బోర్డు తిప్పేసిన ‘నైకీ ట్రేడర్స్’
ABN , Publish Date - Aug 23 , 2026 | 10:08 AM
సంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్, సిల్వర్ వ్యాపారం పేరుతో అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మించిన ఓ సంస్థ పలువురు బాధితుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది.
సంగారెడ్డి జిల్లా, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. గోల్డ్, సిల్వర్ వ్యాపారం పేరుతో అధిక లాభాలు ఇస్తామంటూ నమ్మించిన ఓ సంస్థ పలువురు బాధితుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. హైదరాబాద్‌లోని ‘నైకీ ట్రేడర్స్’ సంస్థలో పెట్టుబడులు పెట్టిన జహీరాబాద్‌కు చెందిన సుమారు 25 మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్డ్, సిల్వర్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని సంస్థ ప్రతినిధులు నమ్మించారు. దీంతో జహీరాబాద్‌కు చెందిన పలువురు వ్యక్తులు విడతల వారీగా సంస్థలో డబ్బులు డిపాజిట్ చేశారు. అయితే కొంతకాలం తర్వాత వడ్డీతో పాటు అసలు డబ్బును కూడా తిరిగి చెల్లించకుండా సంస్థ నిర్వాహకులు తప్పించుకున్నట్లు బాధితులు ఆరోపించారు. మొత్తం డిపాజిట్ల విలువ సుమారు రూ.28 కోట్లు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ స్పందన లేకపోవడంతో బాధితులు జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బాచుపల్లికి చెందిన శేషవర్ధన్‌రెడ్డి, రవీందర్‌బాబు, జగదీశ్, సుస్మిత ఉన్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.
ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా?, బాధితుల నుంచి ఎంత మొత్తంలో డబ్బు సేకరించారు?, ఆ నగదు ఎక్కడికి తరలించారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోల్డ్, సిల్వర్ వ్యాపారం పేరుతో అధిక లాభాలు వస్తాయని చెప్పి భారీ మొత్తాల్లో పెట్టుబడులు సేకరించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
వార్తలు కూడా చదవండి...
లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ
డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు: మంత్రి దామోదర్
ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News