గ్రేటర్‌కు తాగునీటి గండం..!
ABN , Publish Date - Oct 03 , 2026 | 09:40 AM
హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి గండం పొంచి ఉన్నది. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో జలాశయాల్లో సమృద్ధిగా నీళ్లు చేరలేదు.
ఎల్‌నినో ప్రభావంతో కురవని వర్షాలు
పలు జలాశయాలకు రాని వరద
గండిపేట, సింగూరులో వేగంగా తగ్గుతున్న నీళ్లు
సాగర్‌లో మరో 26 అడుగులు తగ్గితే ఇబ్బందులే
నీటి తరలింపునకు అత్యవసర పంపింగ్ చేపట్టాల్సిందే..!
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి గండం పొంచి ఉన్నది. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో జలాశయాల్లో సమృద్ధిగా నీళ్లు చేరలేదు. దీంతో నగరానికి తాగునీటిని అందించే రిజర్వాయర్లలో గతేడాది కంటే గణనీయంగా నీటి మట్టాలు పడిపోయాయి. వర్షాకాలం ఆఖరులోనే ఈ పరిస్థితులుంటే.. ఇక వచ్చే ఏడాది జనవరి నుంచి ఉస్మాన్‌సాగర్ (గండిపేట), సింగూర్, నాగార్జున్‌సాగర్ జలాశయాల్లో నీటి మట్టాలు ఏ స్థాయిలో పడిపోతాయనే ఆందోళన వాటర్‌బోర్డు అధికారుల్లో నెలకొన్నది.
4-6 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు
నగరంలో ఆరు నెలలుగా భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. గతేడాదితో పోల్చితే పలు ప్రాంతాల్లో 4-6 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు పడిపోయాయి. హైదరాబాద్‌పై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపడంతో జూన్ నుంచి కురవాల్సిన సగటు వర్షపాతం కంటే లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ఆయా జలాశయాలకు సైతం వరద చేరలేదు. దీంతో నీటిమట్టాలు పెరగలేదు.
సింగూరులో అత్యవసర పంపింగ్..
సింగూరు నుంచి ప్రస్తుతం రోజుకు 316 మిలియన్ లీటర్ల నీళ్లు నగరానికి వస్తున్నాయి. సింగూరులో గతేడాది 1709.54 అడుగుల్లో నీటిమట్టాలుండగా ప్రస్తుతం 1689.87 అడుగులకు చేరాయి. గతేడాదితో పోల్చితే 20అడుగుల దిగువకు పడిపోయాయి. మరో మూడు అడుగులు పడిపోతే గ్రావిటీ ద్వారా వచ్చే జలాలు పంపుహౌస్‌కు నిలిచిపోతాయి. దాంతో అత్యవసర పంపింగ్ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో వాటర్‌బోర్డు అధికారులు అత్యవసర పంపింగ్‌కు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.
మెజార్టీ ప్రాంతాలకు కృష్ణా నీరే ఆధారం
హైదరాబాద్‌లోని అత్యధిక ప్రాంతాలకు నాగార్జున్‌సాగర్ నుంచి వచ్చే కృష్ణా జలాలే ఆధారం. ప్రతీరోజు మూడు ఫేజ్‌ల్లో 1,252 మిలియన్ లీటర్ల నీళ్లు నగరానికి వస్తున్నాయి. ఏ ఒక్క ఫేజ్ నిలిచినా పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయి. గతేడాది సెప్టెంబరు నెలాఖరులో నాగార్జున్‌సాగర్‌లో నీటిమట్టాలు 584 అడుగులు కాగా, ప్రస్తుతం 536 అడుగులు మాత్రమే ఉన్నాయి. గతేడాదితో పోల్చితే 48అడుగుల మేర దిగువకు నీటిమట్టాలున్నాయి. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఈ ఏడాది నాగార్జున్‌సాగర్‌కు వరద రాలేదు.
మరో 26 అడుగులు తగ్గితే..
నాగార్జున్‌సాగర్‌లో నీటిమట్టాలు మరో 26 అడుగులు తగ్గితే నగరానికి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎండల తీవ్రత, పంటలకు వినియోగం, నగరానికి తరలింపులతో ఐదారు నెలల్లో నాగార్జున్‌సాగర్‌లో నీటిమట్టాలు 510 అడుగులకు పడిపోయే అవకాశాలున్నాయి. దాంతో సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వచ్చే నీళ్లు నిలిచిపోతాయి. ఈ పరిస్థితుల్లో పుట్టంగండి ఛానల్ నుంచి అక్కంపల్లికి భారీ మోటార్ల ద్వారా నీటిని అత్యవసర పంపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటర్‌బోర్డు ఉన్నతాధికారులు నీటి నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయనే దానిపై ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకనుగుణంగా సింగూరుతోపాటు నాగార్జున్‌సాగర్‌లో అత్యవసర పంపింగ్ చేపట్టకపోతే నగరానికి నీటి సరఫరాలో ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
గండిపేటలో తగ్గుతున్న నీళ్లు
గ్రేటర్ పరిధిలో కృష్ణా, గోదావరి నదుల నుంచి రోజుకు 2,639 మిలియన్ లీటర్ల నీటిని తీసుకొచ్చి నగరవాసులకు రోజు విడిచి రోజు అందిస్తున్నారు. గండిపేట (ఉస్మాన్‌సాగర్) జలాశయం నుంచి నగరానికి ప్రతీరోజు 113మిలియన్ లీటర్ల నీటిని తరలిస్తున్నారు. కానీ, పరివాహక ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో గండిపేటకు వరద రాలేదు. గతేడాది 1,789.25 అడుగుల నీటిమట్టం ఉండగా.. ప్రస్తుతం 1,783.55 అడుగుల నీటిమట్టమే ఉన్నది. నీటిమట్టాలు మరింత పడిపోతే బురద స్థాయి పెరగడం వల్ల నీటిని తరలించడానికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇక హిమాయత్‌సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గతేడాదితో పోల్చితే ఒక అడుగు మాత్రమే దిగువకు నీళ్లున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
కల్యాణలక్ష్మి రద్దుకు రేవంత్ కుట్ర
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News