మెడికో సృజన మృతి కేసులో ట్విస్ట్.. పరారీలో రవి
ABN , Publish Date - Oct 03 , 2026 | 08:56 AM
మియాపూర్‌లోని ఓ లాడ్జిలో మెడికో కె. సృజన అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సృజనను రవి హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 03: నగరంలో మియాపూర్‌లోని ఓ లాడ్జిలో మెడికో కె. సృజన అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సృజనను రవి హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సృజనది హత్య కేసుగా పోలీసులు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరో వైపు సెప్టెంబర్ 29వ తేదీన సృజన కోసం మియాపూర్‌లోని లాడ్జిలో రవి రూమ్ బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సృజన వద్దనున్న గోల్డ్ చైన్ ఇస్తానని చెప్పి.. ఆమెను హైదరాబాద్‌కు రప్పించాడు. దీంతో ఆమె హనుమకొండ నుంచి హైదరాబాద్ చేరుకుంది. సెప్టెంబర్ 30వ తేదీనే సృజన మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాతే రవి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మృతురాలి సృజన స్వస్థలం సంగారెడ్డి జిల్లా. ఆమె హనుమకొండలోని ఓ మెడికల్ కాలేజీలో పిడియాట్రిక్స్ చదువుతోంది. తన వద్ద నుంచి తీసుకున్న బంగారు గొలుసు తిరిగి ఇస్తానని స్నేహితుడు రవి చెప్పడంతో సృజన హైదరాబాద్ వచ్చింది. అయితే ఆమె తల్లిదండ్రులకు సృజన ఆచూకీ తెలియలేదు. దీంతో వారు హనుమకొండ పోలీసులను ఆశ్రయించారు.
సృజన సెల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా మియాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. మియాపూర్ పోలీసులు లాడ్జిలో రూమ్ తలుపులు తెరవగా.. మంచంపై సృజన మృతదేహం కుళ్లిపోయిన పరిస్థితిలో కనుగొన్నారు. సృజన తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తేనే కానీ వివరాలు తెలియవని పోలీసులు వెల్లడించారు.