ఏఐ పాటలతో.. ఉక్రెయిన్‌పై రష్యా కొత్త ప్రచారాస్త్రం.!
ABN , Publish Date - Oct 03 , 2026 | 08:43 AM
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఏఐతో రూపొందించిన పాటలను ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రముఖ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో 981 రష్యా అనుకూల యుద్ధ ప్రచార పాటలు ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరో స్థాయికి చేరింది. తాజాగా.. ఉక్రెయిన్‌పై పోరులో భాగంగా రష్యా సరికొత్త ప్రచారాస్త్రాన్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో రూపొందించిన పాటలను ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేసి తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్, యాపిల్ మ్యూజిక్, డీజర్ వంటి ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి పాటలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి. కొన్ని పాటలు ఉక్రెయిన్ ప్రజలను కించపరిచేలా(దూషించినట్టు) ఉండగా.. మరికొన్ని రష్యా సైనికులను కీర్తిస్తూ, యుద్ధాన్ని అవసరమైన రక్షణ చర్యగా చిత్రీకరించినట్టు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. సోవియట్ కాలం నాటి యుద్ధ గీతాల శైలిని ఆధునిక సంగీతంతో జోడించి పాడిన పాటలూ ఇందులో ఉన్నట్లు సమాచారం.
స్థానిక పరిశోధనా నివేదికల ప్రకారం.. మొత్తం 981 పాటలను రష్యా అనుకూల యుద్ధ ప్రచారాస్త్రంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వీటిలో ఎక్కువ భాగం గత రెండేళ్లలో విడుదలైనవే ఉన్నాయి. ఏఐ బేస్డ్ మ్యూజిక్ టూల్స్ అందుబాటులోకి రావడంతో ఈ తరహా పాటల సంఖ్య మరింత పెరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు. వీటిలో యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో రిలీజైన ఓ పాటకు రెండేళ్లలోనే 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి.
అయితే.. ఈ పాటల ప్రచారంలో రష్యా హస్తం ఎంతవరకు ఉందనే విషయంపై స్పష్టత లేదు. కానీ.. ఏఐతో రూపొందిస్తున్న ఈ భారీ కంటెంట్‌ను పర్యవేక్షించడంలో మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఏఐ సాంగ్స్‌ను గుర్తించడం సహా వాటిని లేబుల్ చేసేందుకు కొన్ని సంస్థలు చర్యలు చేపడుతున్నప్పటికీ.. విదేశీ భాషల్లో ఉండే కొన్ని కఠిన పదాలు, ప్రచార సందేశాలను సరిగ్గా పసిగట్టడం సవాలుగా మారుతోంది. దీనిపై ఏఐ మ్యూజిక్ టూల్స్‌కు రష్యన్, ఇంగ్లీష్ భాషల్లో సంబంధిత ప్రాంప్ట్‌లు ఇచ్చి పరీక్షలు నిర్వహించారు కొందరు పరిశోధకులు. తొలుత కొన్ని టూల్స్ ఈ రిక్వెస్ట్‌లను రిజెక్ట్ చేసినా.. ఆ తర్వాత స్వల్ప మార్పులతో అదే తరహా పాటలను రూపొందించి ఇచ్చాయని తెలుస్తోంది. దీంతో ఏఐ టెక్నాలజీ యుద్ధ భూమిలోనే కాకుండా ప్రచార పోరులోనూ కొత్త సాధనంగా మారుతోందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి:
పర్వతాలు.. శిఖరాలు.. సరస్సులు.. లద్దాఖ్‌లో 28 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు
ఏపీ మీదుగా మరో వందేభారత్ స్లీపర్.. హాల్ట్స్ ఇవే?