పర్వతాలు.. శిఖరాలు.. సరస్సులు.. లద్దాఖ్‌లో 28 ప్రాంతాలకు అధికారిక గుర్తింపు
ABN , Publish Date - Oct 02 , 2026 | 08:26 PM
లద్దాఖ్‌లోని 28 భౌగోళిక ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక పేర్లు ఖరారు చేసింది. పర్వతాలు, శిఖరాలు, హిమానీనదాలు, లోయలు, నదులు, సరస్సులు సహా వీటికి సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లో గుర్తింపు లభించనుంది.
ఇంటర్నెట్ డెస్క్: లద్దాఖ్‌లోని 28 భౌగోళిక ప్రాంతాలకు ప్రామాణిక పేర్లను ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు అక్కడి పాలనా యంత్రాంగంతో హోంశాఖ సంప్రదింపులు జరిపి ఈ పేర్లను నిర్ణయించినట్టు కేంద్రం తెలిపింది. దీంతో ఇకపై ఈ పేర్లు సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లోనూ కనిపించనున్నాయి. కేంద్రం గుర్తించిన ఈ 28 ప్రాంతాల్లో పర్వత శిఖరాలు, పర్వతాలు, పర్వత మార్గాలు, హిమానీనదాలు, లోయలు, నదులు, సరస్సులు, జలవనరులు, భూభాగాలు వంటివి ఉన్నాయి.
వీటిలో శిఖరాలుగా అతీశ గిరి, కనిష్క పీక్, మార్తాండ్ గిరి, జొరావర్ పీక్, రించెన్ జాంగ్‌పో, శాక్యశ్రీ గిరి, శివ రీ, మహేశ్వర రీ వంటి వాటికి అధికారిక గుర్తింపు లభించింది. అలాగే.. కరుణ్ పీర్, డ్రాక్ కార్పో, జోల్మోరి పర్వతాలు, చాప్చింగల్ పాస్, షాచ్మిర్క్ పాస్ పర్వత మార్గాలు, పార్పిక్, స్కామ్రీ హిమానీనదాలుగా మ్యాప్‌లో చోటు దక్కంచుకున్నాయి. ష్కోర్గా వ్యాలీకి కూడా ఈ మ్యాప్‌లో గుర్తింపునిచ్చారు. గురు రింపోచేను సరస్సుగా, యాంగ్‌పాను నదిగా, హాట్ స్ప్రింగ్‌ను జలాశయంగా నమోదు చేశారు. వీటితో పాటు బ్రాంగ్సా, కుక్సెల్, దెహ్రా కంపాస్, గోగ్రా, కుమారాయణ పాయింట్, పాంగ్‌లంగ్, షామల్ లుంగ్‌పా వంటి ప్రాంతాలూ ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో దెహ్రా కంపాస్ వివాదాస్పద అక్సాయ్‌చిన్ ప్రాంతంలో ఉన్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
లద్దాఖ్‌లో గుర్తింపు పొందిన ఈ ప్రాంతాలను అధికారిక మ్యాప్‌లో ప్రామాణిక పేర్లతో నమోదు చేయడం ద్వారా వాటి కచ్చితమైన గుర్తింపు, భౌగోళిక ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని కేంద్రం తెలిపింది.
ఇవీ చదవండి:
ఏపీ మీదుగా మరో వందేభారత్ స్లీపర్.. హాల్ట్స్ ఇవే?
‘ఫ్లైయింగ్ అతడికి భార్య లాంటిది’.. స్మిత్ సాహసంపై తండ్రి భావోద్వేగ స్పందన