‘ఫ్లైయింగ్ అతడికి భార్య లాంటిది’.. స్మిత్ సాహసంపై తండ్రి భావోద్వేగ స్పందన
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:36 PM
174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన పైలట్ స్మిత్ మచ్చార్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మిత్ తండ్రి భూపేంద్ర మచ్చార్ స్పందిస్తూ.. భావోద్వేగానికి లోనయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్.. దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినప్పటికీ ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కెప్టెన్ స్మిత్ మచ్చార్ చేసిన సాహసం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటనపై తాజాగా.. స్మిత్ మచ్చార్ తండ్రి భూపేంద్ర మచ్చార్ స్పందించారు. ఈ విషయం తెలియగానే తమలో గర్వం కంటే ఎక్కువగా భయమేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ‘స్మిత్ దాడికి గురయ్యాడని తెలియగానే మేం ఆలయానికి వెళ్లి దీపం వెలిగించాం. మా కుమారుడికి సంబంధించి ఎలాంటి దురదృష్ట వార్తా వినకూడదని దేవుణ్ని వేడుకున్నాం. నిజానికి.. ఎవరూ ప్రత్యేకంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు శిక్షణ పొందరు. అయితే దేవుడి దయతో స్మిత్‌కు ఆ సమయంలో ధైర్యంగా పోరాడారు’ అని పేర్కొన్నారు.
ఈ దాడిలో తమ కుమారుడి తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయన్న ఆయన.. తలకు శస్త్రచికిత్స జరిగిందని, పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వివరించారు. ప్రస్తుతం అబుదాబిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్మిత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందన్నారు. సుమారు 17 ఏళ్లుగా పైలట్‌గా పనిచేస్తున్న స్మిత్‌కు విమానయానమే ప్రపంచమని భూపేంద్ర చెప్పారు. ‘ఫ్లైయింగ్ అతడికి భార్య లాంటిది’ అంటూ తన కుమారుడికి వృత్తిపట్ల ఉన్న మక్కువను కొనియాడారు. వందలాది మంది పైలట్లకు మార్గనిర్దేశం చేయడం కూడా అతడి సహజ స్వభావమన్నారు. తన కుమారుడి సాహసంపై గర్వంగా ఉన్నప్పటికీ.. అతడు పూర్తిగా కోలుకోవడమే తమకు ముఖ్యమని భావోద్వేగానికి లోనయ్యారు. యువత నిజాయతీ, మంచి ఆలోచనలు, తల్లిదండ్రుల పట్ల గౌరవంతో జీవించాలని ఆయన సూచించారు.
కాక్‌పిట్‌లో దాడి జరిగిన సమయంలో విమానం అదుపుతప్పి కిందకు పడిపోవడాన్ని గమనించిన పైలట్ స్మిత్.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలంటే వెంటనే స్పందించాల్సిందేనని నిర్ణయించుకున్నారని భూపేంద్ర తెలిపారు. తీవ్ర గాయాలతోనే కాక్‌పిట్ తలుపు తెరిచి సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేశారన్నారు. అనంతరం అక్కడి ప్యాసింజర్స్.. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగా, విమానంలోని ఆఫ్ డ్యూటీ పైలట్లు దాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఇవీ చదవండి:
భారత్‌కు 114 రఫేల్ యుద్ధవిమానాలు.. కొనుగోలు ప్రక్రియ వేగవంతం!
లాల్ బహదూర్ శాస్త్రి: ఫియట్ కారు అప్పు.. కోట్లాది మంది అభిమానం!