Share News

లోన్ తీసుకుని కారు కొన్న మాజీ ప్రధాని.. ఎల్బీ శాస్త్రి గురించి అరుదైన విశేషాలు మీకోసం..

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:46 PM

పాక్ సైన్యాన్ని తరిమికొట్టి మన సైన్యాన్ని ముందుకు నడిపిన తెగువ ఆయన సొంతం. దేశ రెండవ ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి ఎలాంటి ఆస్తులను వదిలివెళ్లలేదు. కేవలం ఒక కారు అప్పును, అపారమైన కీర్తి ప్రతిష్టలను వదిలివెళ్లారు.

లోన్ తీసుకుని కారు కొన్న మాజీ ప్రధాని.. ఎల్బీ  శాస్త్రి గురించి అరుదైన విశేషాలు మీకోసం..
Lal Bahadur Shastri: The PM Who Left Behind a Car Loan and a Legacy

ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 2: పాకిస్థాన్‌తో యుద్ధంలో దేశాన్ని సమర్థవంతంగా నడిపించి, అంతర్జాతీయ సరిహద్దులు దాటి సైన్యాన్ని ముందుకు నడిపిన తెగువ ఆయన సొంతం. ఆహార సంక్షోభం వచ్చినా దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన ధీరుడు. భారతదేశపు రెండవ ప్రధాని అయిన లాల్ బహదూర్ శాస్త్రి తన వెనుక ఎలాంటి భారీ ఆస్తులను, సంపదను వదిలివెళ్లలేదు. కేవలం ఒక కారు అప్పును, అపారమైన కీర్తి ప్రతిష్టలను మాత్రమే వదిలివెళ్లారు.


అక్టోబర్ 2న గాంధీ జయంతితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా జరుపుకుంటాము. అత్యున్నత అధికారంలో ఉన్నప్పటికీ ఆయన జీవించిన నిరాడంబర జీవితానికి, నేటి రాజకీయాలకు ఆయన ఒక గొప్ప మార్గదర్శి.


పీఎన్‌బీ (PNB) కార్ లోన్ - లలితా శాస్త్రి గారి ఆదర్శం

పిల్లల కోరిక మేరకు శాస్త్రి ఒక 'ఫియట్' (Fiat) కారు కొనాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో దాని ధర దాదాపు రూ.12,000. ఆయన దగ్గర ఉన్న పొదుపు రూ.7,000 కాగా, మిగిలిన మొత్తాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) నుంచి రుణం (Loan) తీసుకున్నారు.

1966 జనవరిలో తాష్కెంట్‌లో ఆయన అకస్మాత్తుగా కన్నుమూసే సమయానికి ఆ అప్పు ఇంకా తీరలేదు. ప్రభుత్వం ఆ రుణాన్ని మాఫీ చేస్తామని ప్రతిపాదించినప్పటికీ, ఆయన భార్య లలితా శాస్త్రి దానికి నిరాకరించారు. తనకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ డబ్బుల నుంచే ఆ బ్యాంకు అప్పును పూర్తిగా చెల్లించారు. ఢిల్లీలోని 'లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్'లో నేటికీ ఉన్న ఆ ఫియట్ కారు, ఆయన నిరాడంబరతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

'శ్రీవాస్తవ' నుంచి 'శాస్త్రి'గా మారిన ప్రయాణం

శాస్త్రి గారు 1904 అక్టోబర్ 2న ఉత్తర్ ప్రదేశ్‌లోని మొఘల్‌‌సరాయ్‌లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి సంరక్షణలో పెరిగారు. కుల వివక్షకు వ్యతిరేకంగా తన కులనామం 'శ్రీవాస్తవ'ను త్యజించి, కాశీ విద్యాపీఠం నుంచి విద్యా పట్టా పొందిన తర్వాత 'శాస్త్రి' అనే పేరును స్వీకరించారు.

నైతిక బాధ్యతకు నిదర్శనం - రైల్వే మంత్రిగా రాజీనామా

1956లో ఓ పెద్ద రైలు ప్రమాదం జరిగినప్పుడు, నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. నాటి ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ రాజీనామాను వద్దని వారించినప్పటికీ, శాస్త్రి గారు ఒప్పుకోలేదు. 1964 మేలో జవహర్ లాల్ నెహ్రూ మరణించిన తర్వాత శాస్త్రి దేశానికి రెండవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

1965 పాకిస్థాన్ యుద్ధం, కీలక నిర్ణయం

ప్రధానిగా ఆయన కాలం స్వల్పమే అయినప్పటికీ, 1965 ఇండో-పాక్ యుద్ధం ఆయన స్థాయిని పెంచింది. పాకిస్థాన్ 'ఆపరేషన్ గిబ్రాల్టర్' ద్వారా కశ్మీర్‌లోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు, శాస్త్రి ఏమాత్రం సంకోచించకుండా పంజాబ్ సరిహద్దుల నుంచి భారత సైన్యాన్ని లాహోర్, సియాల్‌కోట్ వైపు దూసుకెళ్లాలని ఆదేశించారు. ఈ అనూహ్య నిర్ణయంతో పాకిస్థాన్ గజగజలాడింది.

'జై జవాన్.. జై కిసాన్'

యుద్ధం సమయంలో దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో విదేశీ గోధుమలపై ఆధారపడకుండా, వారానికి ఒకపూట ఉపవాసం ఉండాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పద్ధతిని ముందుగా తన ఇంట్లోనే అమలు చేసి, ఆ తర్వాతే దేశ ప్రజలను కోరడం ఆయన నిజాయితీకి నిదర్శనం. దేశ రక్షణను, ఆహార భద్రతను ముడిపెడుతూ ఆయన ఇచ్చిన 'జై జవాన్, జై కిసాన్' నినాదం నేటికీ మారుమోగుతూనే ఉంది.

తాష్కెంట్ ఒప్పందం, చివరి గడియలు

యుద్ధం ముగిసిన తర్వాత రష్యా (సోవియట్ యూనియన్) మధ్యవర్తిత్వంతో పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్‌తో చర్చల నిమిత్తం శాస్త్రి తాష్కెంట్‌ వెళ్లారు. 1966 జనవరి 10న చరిత్రాత్మక 'తాష్కెంట్ ప్రకటన'పై సంతకం చేశారు. అయితే, ఆ మరుసటి రోజే (జనవరి 11, 1966) ఆయన తాష్కెంట్‌లో గుండెపోటుతో (అనుమానాస్పదంగా) కన్నుమూశారు.

ప్రధానిగా కేవలం 18 నెలల కాలమే ఉన్నప్పటికీ, ఒక సాధారణ కుటుంబ కారు కోసం అప్పు చేసి, దేశం కోసం తన జీవితాన్ని ధారపోసిన లాల్ బహదూర్ శాస్త్రి త్యాగం, నాయకత్వం భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తుంది: గవర్నర్ కంభంపాటి

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35.. ఒక్కో కార్డుదారుడికి 2 కిలోల పంపిణీ: మంత్రి నాదెండ్ల

ఒలింపిక్‌లో మెడల్ సాధించేలా ఏపీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 06:21 PM