Share News

భారత్‌కు 114 రఫేల్‌ యుద్ధవిమానాలు.. కొనుగోలు ప్రక్రియ వేగవంతం!

ABN , Publish Date - Oct 02 , 2026 | 02:14 PM

భారత వాయుసేనను మరింత బలోపేతం చేసే దిశగా 114 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి తెలిపారు.

భారత్‌కు 114 రఫేల్‌ యుద్ధవిమానాలు.. కొనుగోలు ప్రక్రియ వేగవంతం!
Rajesh kumar Singh on Rafel Fighter Jets

ఇంటర్నెట్ డెస్క్: భారత వాయుసేనను పటిష్ఠం చేయడంలో భాగంగా 114 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2027 మార్చి) ముగిసేలోగా దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. రఫేల్‌ విమానాల తయారీలో అధిక స్థాయిలో స్వదేశీకరణతో పాటు భారతీయ ఆయుధాలు, వ్యవస్థలను అనుసంధానించడంపై దృష్టి పెట్టినట్టు ఆయన వివరించారు.


ఈ కొనుగోలు ప్రక్రియ 'బై అండ్ మేక్‌' విధానంలో సాగనుందని, ఇందులో అధిక సంఖ్యలో రఫేల్‌ విమానాలను భారత్‌లోనే అసెంబుల్‌ చేయనున్నారని రాజేశ్ తెలిపారు. ఇప్పటికే రఫేల్‌ మెరైన్‌ విమానాల్లో భారతీయ ఆయుధాల అనుసంధానానికి అంగీకారం లభించిందని ఆయన అన్నారు. 114 రఫేల్‌ జెట్ల కోసం ఆహ్వానించిన ప్రతిపాదనలపై(ఆర్ఎఫ్‌పీ) బిడ్లు అందాయని, ప్రస్తుతం వాటిని అధికారికంగా పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు.


మరోవైపు.. తేజస్‌ ఎమ్‌కే2 అభివృద్ధి కూడా కొనసాగుతోందని రక్షణశాఖ కార్యదర్శి తెలిపారు. వచ్చే ఏడాది మధ్యలో తొలి విమాన ప్రయోగం నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రొటోటైప్‌లు సిద్ధమైన తర్వాత భారత వాయుసేన వాటిని పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ సహా ప్రైవేట్ సంస్థలు, ఎంఎస్‌ఎంఈలకూ గణనీయమైన భాగస్వామ్యం ఉంటుందని వివరించారు.


ఇక.. ఐదో తరం యుద్ధ విమానాల గురించి రాజేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం విదేశీ ప్రాజెక్ట్‌‌ను చేపట్టే ఆలోచనలేవీ లేవని స్పష్టం చేశారు. భారత్‌ స్వయంగా అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌(ఏఎమ్‌సీఏ)పైనే దృష్టి ఉందన్నారు. దాని కోసం ఎంపిక చేసిన సంస్థల నుంచి ఆర్ఎఫ్‌పీలను ఆహ్వానించామని, క్లిష్టమైన ప్రాజెక్ట్ కావడంతో సంస్థలు మరింత సమయం కోరాయని ఆయన తెలిపారు.


ఇవీ చదవండి:

ఇండియా గ్రీన్ ఎనర్జీ గ్రిడ్‌తో భారీగా డివిడెంట్లు: యూఎన్ క్లైమేట్ చీఫ్

ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్.. ఈసీ కీలక ఆదేశాలు

Updated Date - Oct 02 , 2026 | 02:28 PM