Share News

నీ ధైర్యసాహసాలకు దేశం గర్విస్తోంది.. పైలట్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:19 PM

ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా పోరాడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. శుక్రవారం వీడియో కాల్‌ ద్వారా మచ్చార్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

నీ ధైర్యసాహసాలకు దేశం గర్విస్తోంది.. పైలట్ మచ్చార్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష

ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన హింసాత్మక ఘటనలో తీవ్రంగా గాయపడినా.. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ధైర్యంగా పోరాడిన భారత కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. శుక్రవారం వీడియో కాల్‌ ద్వారా మచ్చార్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటన సమయంలో కాక్‌పిట్‌లో ఎదురైన పరిస్థితులను కెప్టెన్‌ ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన చూపించిన ధైర్యసాహసాలను మోదీ మరోసారి ప్రశంసించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


‘ధైర్యం చూపకపోతే.. 170 మంది ప్రాణాలు పోయేవి’: మచ్చార్‌

వీడియో కాల్‌లో ప్రధాని మోదీతో మాట్లాడిన సందర్భంగా ఘటనకు సంబంధించిన తన అనుభవాన్ని మచ్చార్‌ వివరించారు. ‘ఆ సమయంలో నేను నా ప్రాణాల కోసం పోరాడుతున్నాను. కానీ నేను ధైర్యం చూపకపోతే 170 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతారని అర్థమైంది’ అని ప్రధానికి చెప్పినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడినప్పటికీ మచ్చార్‌ కాక్‌పిట్‌ తలుపును తెరవగలిగారు. దీంతో సిబ్బంది, ప్రయాణికులు లోపలికి ప్రవేశించి పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు అవకాశం లభించింది.


భారత్‌ గర్విస్తోంది: ప్రధాని మోదీ

మచ్చార్‌ చూపిన ధైర్యాన్ని ప్రధాని మోదీ మరోసారి ప్రశంసించారు. అంతకుముందు ఎక్స్‌ వేదికగా స్పందించిన మోదీ.. కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ను ‘‘హీరో’’గా అభివర్ణించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడినా ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చూపిన ధైర్యం, పట్టుదలను కొనియాడారు. ఆయన సాహసం వందలాది ప్రాణాలను కాపాడిందని పేర్కొంటూ.. ‘‘కెప్టెన్‌ మచ్చర్‌ పట్ల భారత్‌ గర్విస్తోంది’’ అని అన్నారు. అంతకుముందు గురువారం మచ్చార్‌ భార్య, తల్లిదండ్రులతోనూ మోదీ మాట్లాడారు. మచ్చార్‌, ఆయన కుటుంబానికి భారత దౌత్య కార్యాలయాల నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.


9/11 తరహా విషాదాన్ని భారతీయుడు అడ్డుకున్నారు: ప్రధాని మోదీ

ఢిల్లీలో గురువారం జరిగిన యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లోనూ ప్రధాని మోదీ ఈ ఘటనను ప్రస్తావించారు. ‘‘నిన్న జరిగిన ఘటనలో భారత కెప్టెన్‌ స్మిత్‌ అద్భుతమైన సహనం, సమయస్ఫూర్తి, ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని చెప్పినట్లుగా.. ఒక భారతీయుడు 9/11 తరహా విషాదాన్ని అడ్డుకున్నారు’’ అని మోదీ పేర్కొన్నారు.


బుధవారం ఫ్లైదుబాయ్‌ విమానం దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తుండగా కాక్‌పిట్‌లో కెప్టెన్‌, కో-పైలట్‌ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో మచ్చర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో సుమారు 34 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న బోయింగ్‌ 737 విమానం నిమిషానికి దాదాపు 23 వేల అడుగుల వేగంతో కిందకు దిగింది. అనంతరం సుమారు 15,600 అడుగుల వద్ద విమానం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ మచ్చార్‌ కాక్‌పిట్‌ తలుపు తెరవడంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌కు మళ్లించారు.


13 ఏళ్లకు పైగా విమానయాన అనుభవం

కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌కు వాణిజ్య విమానయాన రంగంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు సుమారు 9,750 గంటలు విమానాలు నడిపిన ఆయన.. ఎక్కువగా బోయింగ్‌ 737 విమానాలను నడిపారు. ఫ్లైదుబాయ్‌లో చేరకముందు 11 ఏళ్ల పాటు స్పైస్‌జెట్‌లో పనిచేశారు. అక్కడ లైన్‌ ట్రైనింగ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.


ఇవి కూడా చదవండి..

మచ్చార్‌ తెగువకు ప్రపంచం ఫిదా

నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2026 | 12:45 PM