Share News

మచ్చార్‌ తెగువకు ప్రపంచం ఫిదా

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:12 AM

ప్రాణాలు పణంగా పెట్టి వందల మంది ప్రయాణికులను కాపాడిన ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

మచ్చార్‌ తెగువకు   ప్రపంచం ఫిదా
machar

ప్రాణాలు పణంగా పెట్టి వందల మందిని కాపాడిన పైలట్‌

కోపైలట్‌ దాడిలో మచ్చార్‌ తల, చేతులపై తీవ్ర గాయాలు

మెరుగైన చికిత్స కోసం సౌదీ నుంచి అబుధాబికి తరలింపు

మచ్చార్‌ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

మచ్చార్‌ సమయస్ఫూర్తి ప్రశంసనీయం: ట్రంప్‌

ఆయన నిజమైన హీరో అని ఇజ్రాయెల్‌ ప్రశంసలు

‘విశిష్ట గుజరాత్‌ గరిమా అవార్డు’ ప్రకటించిన గుజరాత్‌ సీఎం

న్యూఢిల్లీ/ దుబాయ్‌, అక్టోబరు 1: ప్రాణాలు పణంగా పెట్టి వందల మంది ప్రయాణికులను కాపాడిన ఫ్లైదుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 9/11 తరహా పెను విషాదాన్ని మచ్చార్‌ నివారించారని.. ఆయన త్వరగా కోలుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల అధినేతలు, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఇక ముంబైలోని తిలక్‌నగర్‌లో ఉన్న స్మిత్‌ మచ్చార్‌ఇంటివద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుని, ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

త్రివర్ణ పతాకాలు చేతబట్టుకుని, భారత్‌ మాతాకీ జై నినాదాలు చేశారు. మచ్చార్‌కు శౌర్యచక్ర పతాకం, భారతరత్న ఇవ్వాలని కొందరు డిమాండ్‌ చేశారు. కాగా, ఒమన్‌ కో-పైలట్‌ దాడిలో మచ్చార్‌ తలకు, చేతులకు తీవ్రగాయాలైన నేపథ్యంలో.. ఆయనను మెరుగైన చికిత్స కోసం సౌదీలోని తబుక్‌ నుంచి ప్రత్యేక విమానంలో అబుధాబికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది.


మచ్చార్‌ తల, చేతులపై తీవ్ర గాయాలు

174 మంది ప్రయాణికులతో దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు వెళుతున్న ఫ్లైదుబాయ్‌ విమానాన్ని కూల్చివేసేందుకు ఒమన్‌ జాతీయుడైన కో-పైలట్‌ కుట్ర చేయడం, దీనిని అడ్డుకున్న పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌పై కత్తితో దాడి చేయడం తెలిసిందే. ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్‌ కత్తితో చేసిన దాడిలో భారతీయ పైలట్‌ కెప్టెర్‌ స్మిత్‌ మచ్చార్‌ తలపై, చేతులపై, ఒంటిపై తీవ్రంగా తెగిన గాయాలయ్యాయి. ఆయనకు విమానంలో వైద్యం అందించిన ముసేవ్‌ షోటా ఇజ్రాయెల్‌ మీడియాతో ఈ వివరాలు వెల్లడించారు. కాక్‌పిట్‌లో ఘర్షణను గమనించి తాను, మరో ముగ్గురం అక్కడికి పరుగెత్తామని, స్మిత్‌ మచ్చార్‌ కాక్‌పిట్‌ తలుపు తెరిచి, కిందపడిపోయారని తెలిపారు. ఆయన తల, చేతులపై కత్తితో తెగిన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అవుతోందని, దాన్ని ఆపేలా వెంటనే ప్రాథమిక చికిత్స అందించానని చెప్పారు. ఆ సమయంలో మచ్చార్‌ తనతో మాట్లాడారని.. తన వయసు 39 అని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారని తెలిపారు. ఇక యూఏఈలోని భారత రాయబారి దీపక్‌ మిట్టల్‌, కాన్సులర్‌ జనరల్‌ ఇమ్మడి విష్ణువర్ధన్‌రెడ్డి గురువారం దుబాయ్‌లో మచ్చార్‌ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. మచ్చార్‌ క్షేమంగా ఉంటారని, ఇందుకోసం భారత ప్రభుత్వం అవసరమైన సాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.


కుట్రపై యూఏఈ దర్యాప్తు

ఫ్లైదుబాయ్‌ విమానం కాక్‌పిట్‌లో జరిగిన ఘర్షణ, కూల్చివేత కుట్రపై యూఏఈ దర్యాప్తు చేపట్టింది. విమానం కూల్చివేత వ్యక్తిగత చర్యా? ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? కూల్చివేత కోసం ముందే కుట్రచేశారా? అందుకు ఎవరు సహకరించారు? అన్న అంశాలపై పరిశీలన జరుపుతున్నట్టు యూఏఈ అధికారులు తెలిపారు. ఇక విమానాన్ని సౌదీలో ల్యాండ్‌ చేసిన నేపథ్యంలో తొలిదశ దర్యాప్తు ఆ దేశంలోనే జరుగుతుందని, తర్వాత ఒమనీ కో-పైలట్‌ను యూఏఈకి అప్పగించే అవకాశంఉందని ఇజ్రాయెల్‌ అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఫ్లైదుబాయ్‌ విమానయాన సంస్థ తెలిపింది. అయితే కో-పైలట్‌ ఒమన్‌ జాతీయుడనిగానీ, ఆయన పేరునుగానీ ఫ్లైదుబాయ్‌ సంస్థ, యూ ఏఈ, ఒమన్‌ దేశాలు అధికారికంగా ప్రకటించలేదు.

విశిష్ట అవార్డు ప్రకటించిన గుజరాత్‌..

స్మిత్‌ మచ్చార్‌ ఫ్లైదుబాయ్‌ విమానాన్ని కాపాడేందుకు చూసిన తెగువకు గుర్తింపుగా గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌.. ఆ రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘విశిష్ట గుజరాత్‌ గరిమా అవార్డు’ను ప్రకటించారు. గుజరాతీ వీరపుత్రుడు కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌కు యా వత్‌ ప్రపంచం సెల్యూట్‌ చేస్తోందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని గుజరాత్‌ ప్రార్థిస్తోందని తెలిపారు. మచ్చార్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రఖ్యాత సోమనాథ్‌ ఆలయంలో మహామృత్యుంజయ మంత్రజపం, ప్రత్యేక పూజలు చేశారు. దేశానికి గర్వకారణం: ముర్ము

పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌ దేశానికి గర్వకారణమని.. ఆయన ధైర్యం, సమయస్ఫూర్తి ఎంతగానో కదిలించాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


ఆసాహసం అసమానం: మోదీ

పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌ ప్రదర్శించిన ధైర్యసాహసాలు అసమానమని ప్రధాని మోదీ కొనియాడారు. గురువారం ఆయన మచ్చార్‌ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. మచ్చార్‌కు అన్నిరకాల సాయం అందుతుందని భరోసా ఇచ్చారు. ‘‘అనుకోకుండా ప్రమాదం ఎదురైనప్పుడు తీవ్రంగా గాయపడినా కూడా ఇతరుల ప్రాణాలు రక్షించేందుకు స్మిత్‌ మచ్చార్‌ గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారు. అమెరికా 9/11 తరహా మారణహోమాన్ని నివారించారు. మచ్చార్‌ను చూసి భారత్‌ గర్విస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని భావిస్తున్నాను’’ అని మోదీ పేర్కొన్నారు. కాగా, స్వప్రయోజనం కంటే సేవకే ప్రాధాన్యం ఇచ్చే భారతీయ స్ఫూర్తిని మచ్చార్‌ నిలబెట్టారని, భారతీయ పైలట్లకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని తెచ్చారని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.

సమయస్ఫూర్తి ప్రశంసనీయం: ట్రంప్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చార్‌ గొప్ప హీరో అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసించారు. ఫ్లైదుబాయ్‌ విమాన ఘటనపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడానని తెలిపారు. మచ్చార్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. దాడి చేసిన కో-పైలట్‌ ఉగ్రవాదిగానీ, మతిస్థిమితం లేనివాడుగానీ అయి ఉంటాడని వ్యాఖ్యానించారు. ఈ ఘటన వెనుక ఇరాన్‌ హస్తం కూడా ఉండవచ్చని, అదే నిజమైతే తీవ్రస్థాయిలో దాడులకు దిగుతామని పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

అఫ్గాన్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదు

భారత పైలట్ మచ్చర్‌పై మోదీ, ట్రంప్, నెతన్యాహు ప్రశంసలు

Updated Date - Oct 02 , 2026 | 05:18 AM