Share News

దీపావళికి స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ అమ్మకాల్లో రికార్డులు

ABN , Publish Date - Nov 07 , 2026 | 08:20 AM

దీపావళి బహుమతి అంటే ఎక్కువ మందికి స్వీట్లు, డ్రైఫ్రూట్సే. తియ్యటి బంధాలను అంతే తియ్యగా వేడుక చేసుకోవడానికి దివాలీని మించిన సందర్భం లేదన్నది చాలామంది భావన.

దీపావళికి స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ అమ్మకాల్లో రికార్డులు
Diwali Sweets Sales

  • నగరంలో మూడు వేల టన్నులకు పైగానే విక్రయాలు

  • సోన్‌ పాపిడికే తొలి ఓటు.. ఆ తర్వాత మిక్స్‌డ్‌ స్వీట్లు

  • గత సంవత్సరంతో పోలిస్తే 15-20% పెరిగిన ధరలు

హైదరాబాద్‌ సిటీ: దీపావళి బహుమతి అంటే ఎక్కువ మందికి స్వీట్లు, డ్రైఫ్రూట్సే. తియ్యటి బంధాలను అంతే తియ్యగా వేడుక చేసుకోవడానికి దివాలీని మించిన సందర్భం లేదన్నది చాలామంది భావన. నగరంలో ఏకంగా మూడు వేల టన్నులకు పైగానే స్వీట్లు పండుగ సీజన్‌లో అమ్ముడుపోతాయని చెబుతున్నారు వ్యాపారులు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి విక్రయాలు 20శాతానికి పైగానే పెరిగాయని పేర్కొంటున్నారు.


city3.3.jpgఆర్డర్లు భళా..

నగరంలో ఈ సంవత్సరం 3000 నుంచి 3,500 టన్నులకు పైగానే స్వీట్లు అమ్ముడుపోతాయని తన నమ్మకం అని అన్నారు నగరంలోని ఓ సుప్రసిద్ధ మల్టీచైన్‌ స్వీట్స్‌ షాప్‌ యజమాని (పేరు వెల్లడించడానికి ఇష్టపడలేదు) తెలిపారు. స్వీట్ల అమ్మకాలపై ఆయన మాట్లాడుతూ ‘గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆర్డర్లు బాగున్నాయన్నారు. కార్పొరేట్‌ గిఫ్టింగ్‌ కూడా ఎక్కువగానే ఉందన్నారు. ఇదే విషయాన్ని పలు స్వీట్‌ హౌస్‌ల యజమానులు కూడా అంగీకరిస్తున్నారు. ఆలివ్‌ మిఠాయి షాప్‌ యజమాని దొరరాజు మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే 20% పైగానే ఆర్డర్లు పెరిగాయన్నారు. ఈసారి మాత్రం డ్రై ఫ్రూట్స్‌ బాక్స్‌ల కంటే జీడిపప్పు, బాదంలతో చేసిన స్వీట్లను బహుమతిగా ఇవ్వడానికే చాలా మంది ఆసక్తి చూపారని చెబుతున్నారు. ఆన్‌లైన్‌ ఆఫర్లకు తోడు బ్యాంక్‌ ఆఫర్లు కూడా ఉండడంతో అమ్మకాలు బాగున్నాయని తెలిపారు. రసగుల్లా, మోతీచూర్‌, బేసిన్‌ లడ్డూ లాంటివి ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారని మోతీనగర్‌ ప్రాంతంలో పలు యాప్‌లకు డెలివరీ పార్టనర్‌గా సేవలనందిస్తోన్న రషీద్‌ చెప్పారు.


city3.jpgసోన్‌ పాపిడికి క్రేజ్‌..

నగరంలో ఈసారి సోన్‌ పాపిడి అమ్మకాలు గణనీయంగా పెరిగాయని పలువురు స్వీట్‌ షాప్‌ల యజమానులు, సూపర్‌ మార్కెట్‌ స్టోర్ల మేనేజర్లు తెలిపారు. ఆల్మండ్‌ హౌస్‌ సీఈఓ చైతన్య ముప్పాల అయితే తాము ముందుగానే ఎంత స్వీట్‌ తయారు చేయాలో నిర్ణయించుకుని, ఆ లెక్క ప్రకారమే తమ తయారీ, అమ్మకాలు చేస్తున్నామన్నారు. నగరంలో పేరున్న ఓ మార్ట్‌ ఈ దీపావళి పండుగ కోసం 55 టన్నుల సోన్‌ పాపిడిని ఆర్డర్‌ చేస్తే తాము కేవలం 25 టన్నులను మాత్రమే సరఫరా చేయగలిగామని ఓ సంస్థ ఏరియా మేనేజర్‌ తెలిపారు. సోన్‌ పాపిడి తర్వాత మిక్స్‌డ్‌ స్వీట్లు, మోతీచూర్‌ లడ్డూ అమ్మకాలు ఉన్నాయి. తమ అమ్మకాలలో దాదాపు 30-40% మోతీచూర్‌ లడ్డూనే ఉంటుందని దొరరాజు తెలిపారు.


తియ్యదనమే.. ధరలూ ఘనమే

గతేడాదితో పోలిస్తే ఈసారి స్వీట్ల ధరలు 15 నుంచి 20%పైనే పెరిగాయి. దీనికి ముడిసరుకుల ధరలు పెరగడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్క పంచదార ధరే 17శాతానికి పైగానే పెరిగిందన్నారు. గ్యాస్‌ ధరలూ పెరగడంతో రేట్లను పెంచక తప్పడం లేదంటున్నారు. గతంలో కిలో రూ.600 ఉన్న మిక్స్‌డ్‌ స్వీట్‌ బాక్స్‌ ఇప్పుడు రూ.720 వరకూ చేరిందని, ప్రీమియం స్వీట్ల ధరలు 20-25%కు పైగానే పెరిగాయని చెబుతున్నారు. డ్రై ఫ్రూట్‌ బాక్స్‌ ధరలు కూడా కిలో రూ.1000 నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు. సాధారణ స్వీట్లకు బదులుగా మరింత ఆలోచనాత్మకంగా, ఆరోగ్యంను దృష్టిలో పెట్టుకున్న వారు బాదములు మొదలు, డ్రై అంజీర్‌, కిస్‌మిస్‌, ఖర్జూర లాంటి వాటిని సైతం గిఫ్టింగ్‌లో జోడిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

పెరటి తోటకు నల్లా నీరు.. రూ.5వేల జరిమానా

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 08:20 AM