Share News

దసరా రద్దీతో రైళ్లన్నీ ఫుల్‌.. వెయిటింగ్‌ లిస్టు కష్టమే

ABN , Publish Date - Oct 09 , 2026 | 09:42 AM

విద్యా సంస్థలకు దసరా సెలవులు శనివారం నుంచి ప్రారంభం కానుండడంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రద్దీ తారాస్థాయికి చేరింది.

దసరా రద్దీతో రైళ్లన్నీ ఫుల్‌.. వెయిటింగ్‌ లిస్టు కష్టమే
Dasara train rush

  • ప్రయాణికుల ఇబ్బందులు

హైదరాబాద్‌ సిటీ: విద్యా సంస్థలకు దసరా సెలవులు శనివారం నుంచి ప్రారంభం కానుండడంతో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో రద్దీ తారాస్థాయికి చేరింది. రెండో శనివారం, ఆదివారం కూడా కలిసి రావడంతో చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు సొంతూళ్ల బాటపట్టారు. సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం రెండ్రోజులు ముందే సెలవు పెట్టుకొని ఊళ్లకు బయల్దేరుతున్నారు. దీంతో నగరంలోని కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లతో పాటు కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి స్టేషన్‌కు కూడా గురువారం నుంచే ప్రయాణికుల రద్దీ పెరిగింది.


రెగ్యులర్‌ రైళ్లలో రిజర్వేషన్‌ కోసం నెల నుంచి ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ప్రస్తుతం వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఆయా స్టేషన్లలోని రిజర్వేషన్‌ కేంద్రాలకు టికెట్లు బుక్‌ చేసుకునేందుకు వెళ్లిన వారికి ’రిగ్రెట్‌‘ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రిజర్వేషన్‌ టికెట్లు దొరకని ప్రయాణికులు సాఽధారణ టికెట్లు తీసుకొని జనరల్‌ బోగీల్లో సైతం ఎక్కేందుకు సన్నద్ధమవుతున్నారు.


city4.jpgఏసీ తరగతుల్లోనూ వెయిటింగ్‌ లిస్ట్‌!

నగరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు, కడప వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ఎక్కువగా రైలు ప్రయాణాలనే ఎంచుకుంటున్నారు. రిజర్వేషన్‌ కన్‌ఫర్మ్‌ కాని వారు తత్కాల్‌ టికెట్ల కోసం రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద పడిగాపులు పడుతున్నారు. తత్కాల్‌ కోటాలో కూడా టికెట్లు దొరకని వారు వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లతోనే బండి ఎక్కేస్తున్నారు. ఇక ఏసీ తరగతుల్లోనూ భారీ వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది.


గంటల కొద్దీ ఆలస్యంగా ప్రత్యేక రైళ్లు

దసరా సందర్భంగా పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ కొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు రెగ్యులర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోనే వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. కొంతమంది రిజర్వేషన్‌ ఉన్నా, లేకున్నా దొరికిన రైల్లో ఫుట్‌బోర్డుపై వేలాడుతూనే వెళ్లిపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పండుగ సీజన్.. గోల్డ్ కొనుగోలుదారులకు ఊరట

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 09:42 AM