బందరు ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేయకుంటే కాంట్రాక్ట్ రద్దు చేస్తా: కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Oct 09 , 2026 | 07:43 AM
బందరు ఫిషింగ్ హార్బర్ పనులు అర్థాంతరంగా నిలిపివేయడంపై స్థానిక ఎమ్మెల్యే, గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి బందరు ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లి.. పనులను ఆయన పరిశీలించారు.
మచిలీపట్నం, అక్టోబర్ 09: బందరు ఫిషింగ్ హార్బర్ పనులు అర్ధాంతరంగా నిలిపివేయడంపై స్థానిక ఎమ్మెల్యే, గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అర్ధరాత్రి బందరు ఫిషింగ్ హార్బర్‌కు వెళ్లి.. పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హార్బర్ పనులు నిలిచిపోవడం పట్ల ఆయన మండిపడ్డారు. అధికారుల బాధ్యతారాహిత్యం, గుత్తేదారు నిర్లక్ష్య వైఖరిపై ఈ సందర్భంగా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హార్బర్ నుంచే జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. గుత్తేదారు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ పనులు జాప్యం చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. మీరెందుకు దృష్టి పెట్టడం లేదంటూ జిల్లా కలెక్టర్‌ను మంత్రి రవీంద్ర ప్రశ్నించారు.
మూడేళ్ల కాలపరిమితితో ఈ ఫిషింగ్ హార్బర్ పనులను గుత్తేదారు దక్కించుకున్నారని చెప్పారు. ఐదేళ్లు అయినా.. ఇంకా ఎందుకు ఈ పనులు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలని గుత్తేదారును నిలదీశారు. అవసరమైతే కాంట్రాక్ట్ టెర్మినేట్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. పనులు పూర్తి చేయడానికి నాలుగు నెలలు సమయం ఇవ్వాలని మంత్రిని ఈ సందర్భంగా గుత్తేదారు కోరారు. ఇంకెంత సమయం ఇవ్వాలంటూ అతడిపై మంత్రి నిప్పులు చెరిగారు.
ఇప్పటికే రెండు సంవత్సరాలు కాల పరిమితిని పెంచినా పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. అయితే సీ మౌత్ డిజైన్ రాకపోవడం వల్ల హార్బర్ పనుల్లో ఆలస్యం అయిందని మంత్రికి గుత్తేదారు వివరించే ప్రయత్నం చేశారు. కుంటిసాకులతో ఇంకెన్ని రోజులు చెబుతారని గుత్తేదారుపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఇకపై ఉపేక్షించేది లేదని అన్నారు. తక్షణం పనులు ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని గుత్తేదారుకు సూచించారు. అవసరమైతే కాంట్రాక్ట్ టెర్మినేట్ చేసి.. కాంట్రాక్టర్ ఆస్తులు జప్తు చేస్తామని గుత్తేదారును మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.