Share News

హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

ABN , Publish Date - Jun 25 , 2026 | 10:16 AM

హైదరాబాద్‌ ఐఎస్ సదన్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.

హైదరాబాద్‌లో ఏటీఎం క్యాష్ దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
Hyderabad ATM Robbery Case

హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఐఎస్ సదన్ పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఏటీఎం వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్‌తో పాటు మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 23వ తేదీన రెయిన్‌బజార్ - సంతోశ్‌నగర్ ప్రాంతంలోని ఓ ఏటీఎంలో నగదు నింపేందుకు ఏటీఎం సిబ్బంది వెళ్లారు. నగదు ట్రంక్ బాక్స్‌ను తీసుకుని సిబ్బంది ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించిన సమయంలో వ్యాన్‌ను బయట నిలిపి ఉంచారు. ఇదే అవకాశంగా భావించిన ఇద్దరు దుండగులు బైకుపై అక్కడికి చేరుకుని వ్యాన్‌లోని రూ.17 లక్షల నగదు ట్రంక్ పెట్టెను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అనంతరం కాసేపటికే ఏటీఎం వ్యాన్ డ్రైవర్ శ్రీనివాస్ కూడా కనిపించకుండా పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.


ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దర్యాప్తులో డ్రైవర్ పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన ఆధారాల మేరకు మరో నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దోపిడీకి ముందస్తు ప్రణాళికతోనే డ్రైవర్ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు. వారు దోచుకెళ్లిన నగదును స్వాధీనం చేసుకునే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు.


ఇప్పటికే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతడిని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు అన్నారు. ఈ ఘటన నగరంలో ఏటీఎం నగదు రవాణా భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. నగదు తరలింపు సమయంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నాం: ఎంపీ రఘునందన్ రావు

రేవంత్‌‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదు.. రెన్యువల్‌ సీఎం.. కేటీఆర్ సెటైర్లు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 25 , 2026 | 10:43 AM