Share News

ఏఐతో ట్రాఫిక్‌ జామ్‌కు చెక్‌!

ABN , Publish Date - Nov 24 , 2026 | 08:30 AM

తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి ప్రభుత్వ విభాగాలు బహుముఖ వ్యూహాలు అమలు చేస్తున్నాయి.

ఏఐతో ట్రాఫిక్‌ జామ్‌కు చెక్‌!

  • సిగ్నళ్ల వద్ద ఐటీఎంఎస్‌ వ్యవస్థ

  • వాహనాల రద్దీ ఆధారంగా సిగ్నళ్ల మార్పు

  • రియల్‌ టైం కండీషన్‌ ఆధారంగా నియంత్రణ

  • క్యూర్‌ పరిధిలోని 429 జంక్షన్లలో ఏర్పాటు

  • డీపీఆర్‌ రూపకల్పన బాధ్యత ఓయూకు

హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో ట్రాఫిక్‌ చిక్కుల పరిష్కారానికి ప్రభుత్వ విభాగాలు బహుముఖ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (హెచ్‌- సిటీ)లో భాగంగా వంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తూ చౌరస్తాల వద్ద సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణానికి బాటలు వేస్తున్నాయి. అదే సమయంలో ఇతర జంక్షన్ల వద్ద సిగ్నళ్ల క్రమబద్ధీకరణ, ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా ఆటోమేటిక్‌గా సిగ్నళ్లు మారేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం క్యూర్‌ పరిధిలోని ప్రాంతాల్లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇంటెలిజెన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఐటీఎంఎస్)ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.


క్షేత్రస్థాయి పరిస్థితుల (రియల్‌ టైం కండీషన్‌) ఆధారంగా సిగ్నళ్ల నియంత్రణ జరిగేలా ఈ వ్యవస్థ పని చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. క్యూర్‌ పరిధిలోని 429 ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఏఐ ఆధారిత ఐటీఎంఎస్‌ను వినియోగంలోకి తీసుకువచ్చే బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీలోని ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి అప్పగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు.


city3.2.jpgఆగకుండా వెళ్లేలా..

క్యూర్‌లోని ట్రాఫిక్‌ సిగ్నళ్లను నూతన వ్యవస్థ ద్వారా ఒకే వేదికపైకి తీసుకురానున్నారు. ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా సిగ్నళ్లను నియంత్రించడంతో పాటు.. రద్దీ సమయాల్లో, భారీ వర్షాలు కురిసినప్పుడు ట్రాఫిక్‌ సాఫీగా సాగేలా సాంకేతిక చర్యలు తీసుకుంటుంది. ఐదు నుంచి 10 కిలోమీటర్ల మేర ఉండే ఏదైనా స్ర్టెచ్‌లోని సిగ్నళ్లు వాహనాల రాకపోకలకు అనుగుణంగా పనిచేయనున్నాయి. ఉదాహరణకు మాసబ్‌ట్యాంక్‌ వంతెన కింద చౌరస్తా వద్ద గ్రీన్‌సిగ్నల్‌ పడితే.. ఆ వాహనాలు తర్వాత సిగ్నల్‌ వద్దకు వచ్చేందుకు ఎంత టైం పడుతుందన్నది, ట్రాఫిక్‌ రద్దీ ఆధారంగా కృత్రిమమేధ అంచనా వేస్తుంది.


ఆ వాహనాలు వచ్చే సమయానికి అక్కడ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఉండేలా ఐటీఎంఎస్‌ ఉపకరిస్తుంది. ఇలా నగరంలో స్ర్టెచ్‌ల వారీగా సిగ్నళ్లను అనుసంధానం చేయనున్నారు. అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా, రహదారి భద్రత మెరుగుపరచడం లక్ష్యంగా ప్రతిపాదిత ప్రాజెక్టు చేపట్టనున్నట్టు జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారొకరు తెలిపారు. ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణ, నియంత్రణలో ప్రస్తుతం ఉన్న విడివిడి విధానాల స్థానంలో సమీకృత, సాంకేతిక ఆధారిత నెట్‌వర్క్‌ను తీసుకురావడమే ఐటీఎంఎస్‌ ఉద్దేశ్యమని చెప్పారు.


టీజీ- మార్స్‌..

ట్రాఫిక్‌ నిర్వహణ, రహదారి భద్రతా కార్యక్రమాల పర్యవేక్షణకు ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రోడ్‌ సేఫ్టీ (టీజీ-టీఎంఏఆర్‌ఎస్‌) పేరుతో సంస్థాగత వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణ, అవసరం మేరకు పలు ప్రాంతాల్లో ఆధునికీకరణ, కొత్తగా వైరింగ్‌, 50నూతన ట్రాఫిక్‌ సిగ్నళ్లు, 15పెలికాన్‌ సిగ్నల్స్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు రూ.77.31 కోట్లు అవసరమని అంచనా వేయగా.. ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 08:30 AM