Share News

కల్తీ మసాలా తయారీ కేసులో సిట్ ఏర్పాటు చేస్తాం: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:29 PM

హైదరాబాద్ కల్తీ మసాలా తయారీ ముఠా కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని సీపీ సజ్జనార్ ప్రకటించారు.

కల్తీ మసాలా తయారీ కేసులో సిట్ ఏర్పాటు చేస్తాం: సీపీ సజ్జనార్
Adulterated Masalas

హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కల్తీ మసాలా తయారీ (Adulterated Masalas) ముఠా కేసులో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) ప్రకటించారు. ప్రమాదకర రసాయనాలతో టన్నుల మసాలా దినుసులను తెలుగు రాష్ట్రాలకు ఈ ముఠా సరఫరా చేస్తోందని తెలిపారు. సిట్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు.


H-FAST మెరుపు దాడులు చేసింది..

హైదరాబాద్‌లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపై H-FAST మెరుపు దాడులు చేసిందని భాగ్యనగర సీపీ పేర్కొన్నారు. 13 మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ప్రజల సమాచారం ఆధారంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని చెప్పుకొచ్చారు. 25 టన్నులకుపైగా కల్తీ మసాలాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కల్తీ మసాలాల కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని అన్నారు. మైలార్‌దేవ్‌పల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు. వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా పలు మసాలాల్లో కల్తీ చేసినట్లు గుర్తించామని తెలిపారు.


ఆ మసాలాల్లో హానికర రసాయనాలు..

ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ కలర్స్‌తో మసాలాలు తయారీ చేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. టాల్కమ్ పౌడర్, ఇండస్ట్రీయల్ డైలు, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. మసాలాలకు మెరుపు కోసం హానికర రసాయనాలను వినియోగిస్తున్నారని తెలిపారు. రంగులు వేసి నాణ్యమైన మసాలాల మాదిరిగా విక్రయిస్తున్నారని చెప్పుకొచ్చారు. 89 టన్నులకుపైగా ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆహార భద్రత చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కల్తీ మసాలాల నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపామని వెల్లడించారు.


ఈ మసాలాలతో క్యాన్సర్..

కల్తీ ఆహారం వల్ల కాలేయం, మూత్రపిండాలకు ముప్పు పొంచి ఉందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ మసాలాలతో క్యాన్సర్, అలర్జీలు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. H- FAST ఏర్పడిన 140 రోజుల్లో 659 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని అన్నారు. 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పద ఆహారంపై వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి

ఆ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరం: కిషన్‌రెడ్డి

అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి మోసం చేశారు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 04 , 2026 | 05:17 PM