Share News

అందుకే సిట్‌ నోటీసుల పేరుతో డ్రామాలు.. సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్

ABN , Publish Date - Jan 23 , 2026 | 06:33 PM

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే సిట్‌ విచారణ వీడియో బయటపెట్టాలని సవాల్ విసిరారు. లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు? అని ప్రశ్నించారు.

అందుకే సిట్‌ నోటీసుల పేరుతో డ్రామాలు.. సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఫైర్
Tanniru Harish Rao

హైదరాబాద్, జనవరి23(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Tanniru Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే సిట్‌ విచారణ వీడియో బయటపెట్టాలని సవాల్ విసిరారు. లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారు..? అని ప్రశ్నించారు. రెండేళ్లు దాటినా లీకు రాజకీయాలే నడుపుతారా..? అని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌వి డైవర్షన్‌ పాలిటిక్స్‌ అని సెటైర్లు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నాడు కోల్‌ స్కాం యూపీఏ ప్రభుత్వ పతనానికి కారణమైందని ప్రస్తావించారు. నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి కోల్‌ స్కాం నాందిగా మారిందని తెలిపారు. సీఎం రేవంత్‌‌రెడ్డి బామ్మర్థి బాగోతం బయటపెట్టినందుకే నోటీసులు పంపించారని చెప్పుకొచ్చారు.


వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు..

సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. సిట్‌.. పొట్టు.. లట్టుకి భయపడేది లేదని ఎద్దేవా చేశారు. మీ అవినీతిని బయటపెట్టే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింగరేణిలో సోలార్‌ పవర్‌ స్కాం బయటపడిందని ఆరోపించారు. నాడు సింగరేణి సిరుల గనిగా ఉండేదని తెలిపారు. నేడు సింగరేణి సృజన్‌ గనిగా మారిందని విమర్శలు చేశారు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందని ఆరోపించారు. మంత్రుల పంచాయతీ కాంగ్రెస్‌కు ఉరితాడులా మారిందని ఆక్షేపించారు. సృజన్‌ వ్యవహారం బయటపెట్టిన తర్వాత.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేదని విమర్శించారు.


తప్పుడు ప్రచారం చేస్తున్నారు..

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే సిట్‌ నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహించారు. సిట్‌ విచారణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లోపల ఏదో జరుగుతోందని తప్పుడు లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. లీకులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కట్టుకథలతో ఇంకెన్నాళ్లు ప్రభుత్వాన్ని నడుపుతారని నిలదీశారు. కోల్‌ స్కాంపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌‌రెడ్డి ఉడత బెదిరింపులకు భయపడేది లేదని హరీశ్‌రావు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం

బీఆర్ఎస్ నేతకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 23 , 2026 | 06:48 PM